
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ, గందరగోళం మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ప్రభుత్వం ఏర్పడటంపై అనుమానాలు బలపడుతున్నాయి. తదుపరి ప్రభుత్వం తమదేనన్న శివసేన నమ్మకంగా చెబుతున్నా.. ఆ పార్టీకి ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మద్దతివ్వడంపై విభిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగేందుకు కారణమయ్యాయి. ‘సోనియాతో మహారాష్ట్ర రాజకీయాలపై మాట్లాడాను కానీ ప్రభుత్వ ఏర్పాటుపై మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’ అని పవార్ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, మహారాష్ట్రలో శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోందని శివసేన వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశంతో పాటు, పవార్‌కు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు తమకు తెలిసిందని శివసేన వర్గాలు వెల్లడించాయి. అయితే, బీజేపీకి మద్దతిచ్చే విషయాన్ని సోమవారం శరదపవార్ నిర్ద్వంద్వంగా ఖండించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మంగళవారం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య ఢిల్లీలో మంగళవారం జరగాల్సిన చర్చలు నేటి(బుధవారం)కి వాయిదా పడ్డాయి. ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున చర్చలను వాయిదా వేద్దామని కాంగ్రెస్ కోరిందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు.
నవంబర్ 22న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమావేశమవనున్నారు. భవిష్యత్ కార్యాచరణను వారికి వివరించనున్నారు. మరోవైపు, శివసేన నేత సంజయ్‌రౌత్ మంగళవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మీడియానే గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. పవార్ మీడియాతో సోమవారం చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘పవార్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవడానికి 100 జన్మలు ఎత్తాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు.
మహమ్మద్ ఘోరిలాంటి వారే..
తాజాగా మరోసారి బీజేపీపై శివసేన విరుచుకుపడింది. పార్టీ పత్రిక సామ్నాలో బీజేపీని భారత్‌పై 17 సార్లు దండెత్తిన మహమ్మద్ ఘోరితో పోలుస్తూ సంపాదకీయం రాసింది. యుద్ధంలో ఓడిపోయిన ఘోరికి హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ ఎన్నోసార్లు ప్రాణబిక్ష పెట్టాడని, కానీ ఒక్కసారి గెలవగానే ఘోరి పృథ్వీరాజ్ చౌహాన్‌ను చంపేశాడని గుర్తు చేస్తూ.. మహారాష్ట్రలో కొందరి తీరు అలాగే ఉందని, నేరుగా బీజేపీ పేరు ఎత్తకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమను సవాలు చేసిన బీజేపీని మహారాష్ట్రలో నామరూపాలు లేకుండా చేస్తామని ఆ సంపాదకీయంలో శివసేన ప్రతిన బూనింది. ఎన్డీయే ఏర్పాటులో శివసేనదే కీలక భూమిక అని, ఆ సమయంలో ఇప్పటి బీజేపీ నాయకులంతా బచ్చాలని మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment