సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కలహాలు కాపురం క్లైమాక్స్‌కు చేరినట్టు కనిపిస్తోంది. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ-శివసేన ఆది నుంచి ఉప్పు-నిప్పులా చిటపటలాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీతో తెగదెంపులకు సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీయే తమ ప్రధాన శత్రువు అని ప్రకటించారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. తాజాగా మంగళవారం శివసేన అధికార పత్రిక 'సామ్నా' మరో బాంబ్ పేల్చింది. 'ఠీక్ లగేతో దేఖో, వర్న చోడ్ దో' (ఇష్టమైతే ఉండండి.. లేకపోతే వదిలేయండి' అంటూ 'సామ్నా' ప్రచురించిన సంపాదకీయంలో.. బీజేపీకి నచ్చితో శివసేనతో పొత్తు కొనసాగించాలని, లేదంటే దేవేంద్ర ఫడవిస్ ప్రభుత్వం పొత్తు నుంచి వైదొలగవచ్చునని తేల్చిచెప్పింది.
ఇప్పటికే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మిత్రపక్షం శివసేన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఏకకాలంలో ఆ పార్టీ అధికారపక్షంగా, ప్రతిపక్షంగా రెండు పాత్రలు పోషించలేదని, కావాలంటే తమతో పొత్తు విషయంలో సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకోవచ్చునని అల్టిమేటం జారీచేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపే తమ ప్రధాన శత్రువు అని శివసేన నేత రౌత్ వ్యాఖ్యలు చేశారు. మోదీ హవా మసకబారిందని, దేశాన్ని నడిపించే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని ఆయన టీవీ చర్చలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంతో తాజాగా ఫడ్నవిస్ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ 'సామ్నా' సంపాదకీయాన్ని ప్రచురించింది. శివసేనతో పొత్తు కొనసాగించాలా? లేదా? అన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉందని తెగేసి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment