
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియాతోపాటు ఏఐసీసీ ప్రకటించిన పార్టీ కమిటీలపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ నేతలపై చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీలపై రాజగోపాల్‌రెడ్డి గురువారం బహిరంగ విమర్శలు చేయడం తెలిసిందే. పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేకుండా పోతోందని, కమిటీల్లో తమకు ప్రాధాన్యమివ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బ్రోకర్లందరికీ కమిటీలో స్థానం కల్పించారని ధ్వజమెత్తారు. కుంతియా రాష్ట్రానికి పట్టిన శని అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ మీడియాలో ప్రచారం కావడం, పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కడంతో పీసీసీ సత్వరమే నష్ట నివారణ చర్యలకు దిగింది. హైకమాండ్ ఆదేశాలతో పీసీసీ క్రమశిక్షణా కమిటీ శుక్రవారం గాంధీ భవన్‌లో సమావేశమైంది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కో చైర్మన్ శ్యామ్ మోహన్, సభ్యులు కమలాకర్‌రావు, బలరాం నాయక్, శ్రీనివాసరావు, సంబాని చంద్రశేఖర్ తదితరులు హాజరవగా మరో సభ్యుడు, ఎంపీ నంది ఎల్లయ్య గైర్హాజరయ్యారు. ఈ భేటీలో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల వీడియోలను మరోసారి పరిశీలించారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని నిర్ధారించి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
రెండు రోజుల గడువు: పీసీసీ నాయకత్వంపై రాజగోపాల్‌రెడ్డి గతంలోనే పత్రికా ప్రకటనలు ఇచ్చినట్లు తమకు అనేక ఫిర్యాదులు అందాయని షోకాజ్ నోటీసులో కమిటీ పేర్కొంది. ‘మరోమారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశిస్తూ మీరు అవమానకర రీతిలో మాట్లాడినట్లు మా దృష్టికి వచ్చింది. రాహుల్ గాంధీ నియమించిన పీసీసీ కమిటీలపైనా అసంబద్ధమైన, పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు చేసినట్లు నోటీసుకొచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఇటీవలే పార్టీకి వ్యతిరేకమైన ప్రకటనలను మీడియా ముఖంగా ఎవరూ చేయరాదని ఆదేశించారు. ఒకవేళ చేస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా మీరు బహిరంగంగా విమర్శలు చేసినందున ఆ వ్యాఖ్యలపై రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వండి. ఒకవేళ వివరణ ఇవ్వకుంటే పార్టీ నియమావళిని అనుసరించి మీపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద చర్యలు తీసుకుంటాం’అని క్రమశిక్షణా కమిటీ రాజగోపాల్‌రెడ్డికి స్పష్టం చేసింది.
ఘాటుగానే స్పందించిన ఉత్తమ్..
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ పార్టీలో చేరిన సందర్భంగా ఉత్తమ్ పరోక్షంగా రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమశిక్షణ, సమష్టి కృషితో ముందుకు పోవాలని రాహుల్ గాంధీ ఇటీవలే సూచించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ కార్యకర్తల చెమట, రక్తంతోనే పార్టీ నిలబడిందని, అందరి కృషితో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.