
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య పదునైన విమర్శలు కాకరేపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఎన్నికలకు ఇక ఎనిమిది రోజుల వ్యవధే ఉండటంతో బీజేపీపై నిప్పులుచెరుగుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వరుస ట్వీట్‌లు చేశారు. అధికారం కోసం బీజేపీ కుయుక్తులకు పాల్పడుతోందని విమర్శించారు. కొన్ని ఓట్ల కోసం సీఎం అభ్యర్థిగా యడ్యూరప్పను ప్రకటించి ఆ తర్వాత పక్కనపెట్టారని, హంగ్ అసెంబ్లీ భయంతో రెడ్డి సోదరులను రంగంలో దింపారని ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థుల పైకి ఐటీ అధికారులను ఉసిగొల్పుతున్నారని, దేవెగౌడను ప్రశంసలతో ముంచెత్తుతూ జేడీఎస్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సిద్ధరామయ్య బీజేపీపై ధ్వజమెత్తారు. మతప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకు యూపీ సీఎంను రప్పించారని ఆరోపించారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో పాలక కాంగ్రెస్ విజయాలపై 15 నిమిషాల పాటు పేపర్ చూడకుండా ప్రసంగించాలని రాహుల్‌కు మోదీ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment