
సాక్షి, బెంగళూర్ : పాలక కాంగ్రెస్‌కు, బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరు నెలకొంది. వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొంటుందనే వార్త మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర, మాజీ సీఎం, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రతో తలపడతారని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి యతీంద్ర బరిలో ఉంటారని ప్రకటించగా, బీజేపీ ఇంకా విజయేంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు.
సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర వైద్య వృత్తిలో ఉంటూ 2013 కర్ణాటక ఎన్నికల్లో చురుకుగా వ్యవహరించారు. వరుణ నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప కుమారుడు బరిలో ఉంటారన్న వార్తలపై యతీంద్ర స్పందించారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే విజేత ఎవరన్నది నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఈ వారంలోనే విజయేంద్ర మైసూరు నుంచి వరుణ నియోజకవర్గంలో తన పర్యటనను చేపడతారని భావిస్తున్నారు. 2016లో తన పెద్ద సోదరుడి మరణానంతరం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని తాను నిర్ణయించుకున్నానని విజయేంద్ర చెప్పారు. ఇరు పార్టీల అగ్రనేతల కుమారులు తలపడుతున్న వరుణ నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.