
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలే కళా శాలలు పెట్టి విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచైనా ఈ పథకం అమలు చేసేలా చూస్తామన్నారు.
టీఆర్‌ఎస్ పాలనను చూస్తుంటే తనకు నక్సలిజంలో చేరాలనిపిస్తోందని కోమటిరెడ్డి అదే సందర్భంగా లాబీల్లో వ్యాఖ్యానించారు. మంచి చేస్తారంటే మరో 20 సంవత్సరాలు అధికారం టీఆర్‌ఎస్‌కే రాసిస్తామని, వచ్చే నెలలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై భారీ బహిరంగ సభ లేదా ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తామని తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అమల్లోకి తెచ్చిందనే అక్కసుతోనే ఈ పథకాన్ని టీఆర్‌ఎస్ నీరుగారుస్తోందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు.