
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరిలాంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీతో తాము పోరాటం చేస్తుంటే.. ఆ పార్టీతో లాలూచీ పడ్డామని కుటిల విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలను తప్పుబట్టారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో దీక్ష చేస్తున్న పార్టీ ఎంపీలకు మద్దతు తెలిపిన ఆమె.. ఎంపీలతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడారు. సాక్షాత్తూ పార్లమెంటులో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే విలువలేకుండా పోయిందని, ప్రధాని మోదీగారు ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు నిజమైన పోరాటాన్ని చేస్తున్నారో గుర్తించాలని ప్రజలను కోరారు. హోదా కోసం ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, కలిసికట్టుగా పోరాడితే ఫలితం దక్కుతుందన్నారు. ఇదే టీడీపీ ఎంపీలు నాలుగేళ్ల ముందు ఏం మాట్లాడారో గుర్తుతెచ్చుకొని.. ఇప్పుడు మాట్లాడాలని హితవు పలికారు.
కేంద్ర ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్‌సీపీ నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా అవిశ్వాసంపై చర్చ చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనితనం ఉందని, ఇతర రాష్ట్రాలకు వేలకోట్లు ఇస్తూ.. ఏపీకి మాత్రం నిధులు ఇవ్వడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజలకు జీవనాడి అని, వైఎస్‌ఆర్ బతికి ఉంటే ఆ ప్రాజెక్టు ఏనాడో పూర్తయ్యేదని పేర్కొన్నారు.
రాజీనామా చేసేవరకు వారిని తరిమికొట్టాలి!
ప్రత్యేక హోదా కోసం ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పార్టీ ఎంపీలు చేస్తున్న దీక్షలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. ఆనాడు ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని... హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌ను చంద్రబాబు అరెస్టు చేయించారని గుర్తుచేశారు. బీజేపీతో కుమ్మక్కయి హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని మండిపడ్డారు. హోదా కోసం నాలుగేళ్లుగా పార్లమెంటులో పోరాడుతున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు తాజాగా తమ పదవులకు రాజీనామా చేశారని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షకు దిగారని అన్నారు.
రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఏపీని విస్మరిస్తున్న టీడీపీ-బీజేపీలకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని ఆమె అన్నారు. చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏకపక్షంగా మారిందని ఎద్దేవా చేశారు. అందరు కలిసికట్టుగా పోరాడితే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని అన్నారు. బీజేపీని కాపాడుకునేందుకే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే వైఎస్సార్‌సీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. బాబు వస్తేనే జాబు వస్తుందని ఎన్నికల్లో హామీ ఇచ్చి చంద్రబాబు యువతను మోసం చేశారని అన్నారు. విపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాజీనామా చేసేవరకు టీడీపీ ఎంపీలను తరిమికొట్టాలని ఏపీ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment