
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరోజు దీక్షపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్నది ధర్మ దీక్ష కాదని, కేవలం ఉపవాసం మాత్రమేనని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఢిల్లీలో దీక్ష చేసి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని రోజా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు... స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటే బలవంతంగా ఈ ప్రభుత్వాలు దీక్షను భగ్నం చేశాయి. ఈ రోజు చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష. ఇదే దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఉపయోగం ఉండేది. ఈ దొంగదీక్షకు రూ.30కోట్ల ప్రజాధనం వృధా. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా స్పీకర్ లేని చూసి ...స్పీకర్ ఛాంబర్‌లో దొంగ నాటకాలు ఆడింది టీడీపీ ఎంపీలే.
ఇక చంద్రబాబు ఏడాది తిండి ఖర్చు రూ.8కోట్లు. కేవలం పుల్కాలు, కూరగాయలు తినేవాడికి ఇంత బడ్జెట్ అవసరమా?. సీరియస్‌గా దీక్ష చేయాల్సిందిపోయి ఎన్టీఆర్ డూప్‌లు పెట్టుకుని దీక్షలో కామెడీ చేస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి నేతను అవమానపరుస్తున్నారు. ప్రత్యేక హోదాకు సమాధి కట్టి, ప్యాకేజీ అంగీకరించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి వెళ్లగొట్టి పార్టీని, ట్రస్ట్ భవన్‌ను లాక్కుని, ఎంపీలు, ఎమ్మెల్యేలను లాక్కుని...ఆఖరుకు ఎన్టీఆర్ మృతదేహాన్ని కూడా లాక్కున్నారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ ఫోటోకు దండ వేసి దండం ఎలా పెడుతున్నారు?. వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తే చూపించడానికి ఎల్లో మీడియాకు మనసులేదు. 30కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి దీక్ష చేస్తుంటే ఎల్లో మీడియా కవరేజ్ చేస్తోంది.
నిన్నటివరకూ పవన్ కల్యాణ్‌ను మోసిన ఎల్లో మీడియా ఇవాళ అతడిపై బురద జల్లుతోంది. చంద్రబాబు ఇచ్చే తాయిలాల కోసం ఎల్లోమీడియ రాష్ట్ర ప్రయోజనాలను మంటగలుపుతోంది. 25మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేదికాదు. చంద్రబాబు దీక్షను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నాలుగేళ్ల నుంచి హోదాను బతికించిన వైఎస్ జగన్ వెంటే ప్రజలు ఉన్నారు.
వైఎస్ జగన్...ఎంపీలు రాజీనామా చేస్తారు అని ప్రకటించగానే ప్రత్యేక హోదా అంటూ చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో లాబీయింగ్ కోసమే ఎంపీలు చేత రాజీనామా చేయించడం లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రధాని మోదీ దీక్ష చేస్తే ...చంద్రబాబు మాత్రం రూ.30కోట్ల ఖర్చుతో దీక్ష చేశారు. ఇక రూ.200 కోట్లతో ఇల్లు కట్టుకుని దానికి కావాల్సిన బిల్లులన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తూ ప్రజా అవసరాలకు మాత్రం డబ్బు లేదంటున్నారు. ఇక ఎమ్మెల్యే బాలకృష్ణ మతి భ్రమించి మాట్లాడుతున్నారు.’ అని రోజా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment