
హైదరాబాద్/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. బాబు హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆయన అన్ని రంగాల్లో దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ రూపొందించిన చార్జిషీట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తమ్మినేని సీతారాం, జోగి రమేష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు విడుదల చేశారు.
హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో అభివృద్ధి సున్నా అని ధ్వజమెత్తారు. అనినీతి, అరాచకాలు ఆకాశాన్నంటాయని అన్నారు. అందుకే చంద్రబాబు పాలనా వైఫల్యాలను చార్జిషీట్‌లో పొందుపరిచామని తెలిపారు. ఉమ్మారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే...
‘‘ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు చతికిలపడ్డారు. వైఎస్సార్‌సీపీ చార్జ్‌షీట్, టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు సరిచూసుకోవాలి. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాను ముఖ్యమంత్రి పెంచి పోషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు పెట్టిన మొదటి ఐదు సంతకాలకు ఇప్పటికీ మోక్షం కలగలేదు.
మొదటి సంతకాలకు ఉన్న ప్రాధాన్యతను చంద్రబాబు తగ్గించారు. రుణాలను మాఫీ చేయకుండా రైతాంగానికి వెన్నుపోటు పొడిచారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు సిగ్గుపడాలి. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక్క పంటకైనా మద్దతు ధర ఇచ్చారా? మద్యం బెల్టు దుకాణాలు మూసి వేస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్కటైనా మూసివేయించారా? రూ.2కే 20 లీటర్ల మంచినీరు ఇస్తామని సంతకం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క చోటైనా నీరు ఇచ్చారా?
గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం
రాజధాని నిర్మాణాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు బ్రహ్మాండమైన గ్రాఫిక్ చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారు. మూడు పంటలు పండే పొలాలను రాజధాని కోసం బలవంతంగా తీసుకున్నారు. అమరావతిలో ఇంతవరకు ఒక్క శాశ్వత భవన నిర్మాణం కూడా నిర్మించలేదు. 13 జిల్లాలకు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు.
అందులో కనీసం 10 శాతమైనా అమలు చేసినట్లు చూపిస్తే చంద్రబాబుకు సెల్యూట్ చేస్తాం. అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని ఉమ్మారెడ్డి తేల్చిచెప్పారు.
బాబు నాలుగేళ్ల సినిమా అట్టర్ ఫ్లాప్
చంద్రబాబు నాలుగేళ్ల సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ప్రమోషన్లతో కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పదవి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని అన్నారు.
రాజ్యంగబద్ధంగా గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు హీనంగా చూస్తున్నారని ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పాలనలో అరాచకాలు, భూ కబ్జాలు, కమీషన్ల వ్యాపారం రాజ్యమేలుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేతలు వాసిరెడ్డి పద్మ, నారమల్లి పద్మజ, చల్లా మధుసూదన్‌రెడ్డి, ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ప్రభుత్వానికి మరణమే శరణ్యం: తమ్మినేని సీతారాం
అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా ఐసీయూలో ఉందని, దీనికి మరణమే శరణ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన తొలి సంతకం ఇప్పటికీ చివరి సంతకంగానే మిగిలిపోయిందన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయలేదని ఆరోపించారు.
అన్ని హామీలకు తూట్లు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలనూ దగా చేశారని విమర్శించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ వెబ్‌సైట్ నుంచి మాయం చేశారని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఓ సంస్థ వెల్లడించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని మరో సంస్థ ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రాలు విడుదల చేయాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు.
అవినీతిపై విచారణ జరిపించాలి
పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని చంద్రబాబు పాలనపై విడుదల చేసిన చార్జిషీట్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాజధాని ప్రకటనకు ముందే బాబు తన బినామీలతో అక్కడ భూములు కొనిపించారని, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అందులో పేర్కొన్నారు.
అమరావతి భూ కేటాయింపుల్లో మూడేళ్లుగా రూ.వేల కోట్లు చేతులు మారాయని, ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబం సాగించిన విదేశీ లావాదేవీలు, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్, ఓటుకు కోట్లు కేసు, ఐఎంజీ భారత్ స్కాం, అగ్రిగోల్డ్ స్కాం, చంద్రబాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు, మంత్రి నారా లోకేశ్ సంపాదన, తిరుమలలో అరాచకాలు, సింగపూర్ కంపెనీలకు రాజధాని భూముల అప్పగింత, నీరు–చెట్టు, భూ సేకరణ, భూ సమీకరణ పేరుతో చేసిన అరాచకాలపై తక్షణం విచారణ చేపట్టాలని చార్జిషీట్‌లో డిమాండ్ చేశారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి దక్కిన కిరీటాలు
‘‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, మహిళల అక్రమ రవాణాలో నెంబర్ 2, దళితులపై దాడుల్లో నెంబర్ 4, రైతుల అప్పుల్లో నెంబర్ 1, దొంగతనాలు, దోపిడీల్లో నెంబర్ 6, ప్రమాదాల్లో నెంబర్ 7, హెచ్‌ఐవీ కేసుల్లో నెంబర్ 1. ఇలా రాష్ట్రానికి ఎన్నో కిరీటాలు దక్కాయి. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట వారికి కాదని టీడీపీ నేతలకు కట్టబెడుతూ ఏకంగా జీవోలు జారీ చేశారు’’ అని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment