నీళ్లను దోచుకెళ్తే చూస్తూ ఊరుకోం.. | Sunitha Laxma Reddy Criticized TRS | Sakshi
Sakshi News home page

నీళ్ల దోపిడీ చేస్తుండ్రు   

Published Tue, Jul 31 2018 10:53 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Sunitha Laxma Reddy Criticized TRS - Sakshi

జలదీక్షలో మాట్లాడుతున్న మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి

మెదక్‌రూరల్‌ : ఇసుక దోపిడీ, భూముల దోపిడీ చాలదన్నట్లు టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు నీళ్లను దోపిడీ చేస్తున్నారని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  సింగూరు జలాలను విడుదల చేయాలని, 885 జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మెదక్‌ మండలం మాచవరం శివారులోని ఎమ్‌ఎన్‌ కెనాల్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ సింగూరు జలాలను వెంటనే విడుదల చేసి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా..  నీళ్లు విడుదల చేయకపోవడంతో వేసిన నాట్లు వేసినట్లే ఎండిపోతున్నాయన్నారు.  కెనాల్‌ పరిధిలోని నార్లు సైతం ముదురుతున్నాయన్నారు. సింగూరులో 29 టీఎంసీల నీరు ఉంటే 15 టీఎంసీల నీటిని మంత్రి హరీశ్‌రావు కరీంనగర్‌కు తరలించారన్నారు. దీంతో 14 టీఎంసీల నీరు మాత్రమే సింగూరులో ఉందన్నారు. 16.5 టీఎంసీల నీరు ఉంటేనే ఘనపురం కాల్వలోకి సింగూరు జలాలను విడుదల చేయాలంటూ 885 జీఓను తీసుకురావడం దుర్మార్గమన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మెదక్‌ జిల్లా రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.  నిబంధనలను తుంగలో తొక్కుతుందని విమర్శించారు. కేసీఆర్‌ను సీఎం చేయడం, హరీశ్‌రావును మంత్రిని చేయడం, పద్మాదేవేందర్‌రెడ్డిని ఉపసభాపతిని చేయడమే రైతులు చేసిన పాపమా అని ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 

చెరుకు రైతుల జీవితాల్లో చేదు

సింగూరు డెడ్‌ స్టోరేజీలో ఉన్నప్పుడు కూడా రైతులకు నీళ్లు వదిలిన ఘనత కాంగ్రెస్‌దన్నారు. సింగూరు జలాలు రైతుల హక్కు అని, మరో ఐదు రోజుల్లో సింగూరు నీటిని విడుదల చేయకుంటే రైతులతో కలిసి ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పోరాడి సాదించుకున్న రాష్ట్రంలో తెలంగాణ పాలకులు నీళ్లను దోచుకెళ్తుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేదాక రైతులు పంటలు పండించుకోవద్దా ?  అన్ని ప్రశ్నించారు.

జిల్లా రైతులపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారు. 100 రోజుల్లో చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి చెరుకు రైతుల జీవితాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేదు నింపిందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను త్వరలో ఎండగడతామన్నారు. అనంతరం కలెక్టరేట్‌కు రైతులతో కలిసి పాదయాత్రగా వెళ్లి డీఆర్వో రాములుకు వినతి పత్రం అందజేశారు.

అక్కడి నుంచి మెదక్‌ పట్టణంలో రాస్తారోకో చేయగా పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు బట్టి జగపతి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాత్‌రావు, చంద్రపాల్, మామిళ్ల ఆంజనేయులు, మ్యాడం బాలకృష్ణ, ఆంజనేయులు, శ్యాంసుందర్, శ్రీకాంత్, నరేందర్, మార్గం నాగరాజు, మేకల అంజనేయులు, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ మెదక్, పాపన్నపేట, కొల్చారం రైతులు ఉన్నారు.

జలదీక్షకు అనూహ్య స్పందన

జలదీక్షకు   మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల నుండి వందల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. సభా ప్రాంగణంలో రైతులు, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు టీఆర్‌ఎస్‌ రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. మెదక్‌–నర్సాపూర్‌ ప్రధాన రహదారిపై వంటవార్పు కార్యక్రమం నిర్వహించి భోజనాలు చేశారు. కాంగ్రెస్‌ నేతలతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల ఎమ్‌ఎన్‌ కెనాల్‌ కిక్కిరిసింది. సింగూరు నీటిని విడుదల చేసి పంట పొలాలను సస్యశామం చేయాలని డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement