వైరల్‌ అవుతున్న ఓ అఫిడవిట్‌...ఆస్తి ఎంతో తెలిస్తే | Tamil Nadu Bypoll Candidate Declares Rs 4lakh cr debt | Sakshi
Sakshi News home page

వైరల్‌ అవుతున్న ఓ అఫిడవిట్‌...ఆస్తి ఎంతో తెలిస్తే

Published Thu, Apr 4 2019 6:40 PM | Last Updated on Thu, Apr 4 2019 8:21 PM

Tamil Nadu Bypoll Candidate Declares Rs 1.7 Lakh Cr cash And Rs 4 lakh cr debt - Sakshi

సాక్షి, చెన్నై:  తమిళనాడులోని పెరంబూరు అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అభ్యర్థి  సమర్పించిన అఫిడవిట్‌ ఇపుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. అఫిడవిట్ల పరిశీలనలో ఎన్నికల సంఘం పనితీరుపై అసహనం వ్యక్తం  చేస్తూ తన ఆస్తులకు సంబంధించి అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలను చూపించారు. తన ఆస్తి 1.7 లక్షల కోట్ల రూపాయలనీ, వరల్డ్ బ్యాంక్‌కు తాను బకాయిపడ్డ మొత్తం నాలుగు లక్షల కోట్ల రూపాయలని ప్రకటించడం చర్చకు దారితీసింది. రిటైర్డ్ పోలీస్ అధికారి మోహన్‌ రాజ్‌ (67) నామినేషన్‌తోపాటు ఈ వింత అఫిడవిట్‌ను దాఖలు చేశారు. తన నామినేషన్‌ స్వీకరించడంతో ఇది ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయిందని చెప్పారు. 

మోహన్‌రాజ్‌ ఈ నంబర్లను ఎంచుకోవడం వెనక రహ్యసం ఏమిటంటే.. తన ఆస్తిగా ప్రకటించిన రూ.1.76 లక్షల కోట్లు 2జీ కుంభకోణం విలువ. ఇక రూ.4 లక్షల కోట్ల అప్పు విషయానికి వస్తే..ఇదితమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పు. (2019-20బడ్జెట్‌లో మార్చి, 2020 నాటికి అప్పురూ.3,97,495.96 కోట్లకు చేరనుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.)

అయితే పోలీసు విభాగంనుంచి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్న తనకు సొంత ఇల్లు ఉందన్న విషయాన్ని ప్రకటించలేదన్నారు. తన భార్యకు  రూ. 2.50 లక్షల విలువ చేసే 13 సవర్ల బంగారం, 20వేల రూపాయల నగదు  ఉన్నట్టు ప్రకటించారట. అలాగే మూడు లక్షల రూపాయల  గోల్డ్‌లోన్‌ ఉండగా,  బ్యాంకు ఈ బంగారాన్ని వేలం వేసినట్టు తెలిపారు. 

తమిళనాడు ప్రభుత్వం 2 జి స్పెక్ట్రమ్ కేసు సరిగా దర్యాప్తు చేయలేదని ఆరోపించడంతోపాటు ప్రభుత్వం "అసమర్ధత పరిపాలన" కు నిదర్శనం రూ .4 లక్షల కోట్ల భారీ రుణ భారమని మండిపడ్డారు. 2009 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా తాను ఇలాంటి అఫిడవిట్‌నే సమర్పించాననీ, తన రూ.1,977 కోట్లగా చూపించానని చెప్పారు. అయినా తనపై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు లేవని తెలిపారు. అంతేకాదు అఫిడవిట్‌లో మీరు ఏమి డిక్లేర్‌ చేసినా, ఈడీ ఏమీ చేయదంటూ ఎద్దేవా చేశారు. ఇటువంటి తప్పుడు డిక్లరేషన్ చేసినందుకు ఎలాంటి చర్యలను ఎదుర్కోలేదా అన్ని ప్రశ్నించినపుడు..ఈసీ నుంచి తనకు కనీసం నోటీసు కూడా రాలేదన్నారు.  

ఎన్నికల కమిషన్‌ సహా పలు అధికారుల వైఖరితో విసిగిపోయానని, ఇలాంటి తప్పుడు ప్రకటనలను నేరం కింద పరిగణించాలని మోహన్‌ రాజ్‌ డిమాండ్‌ చేశారు. జాతి మంచి కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెబుతున్న ఈయన ఓ స్వాతంత్య్ర సమరయోధుడి తనయుడు కావడం విశేషం. అయితే మోహన్‌రాజ్‌ అఫిడవిట్‌పై ఎలక్షన్‌ కమిషన్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.  ఏప్రిల్‌ 18న ఇక్కడ  పోలింగ్‌ జరగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement