
సాక్షి,,హైదరాబాద్: జాతీయస్థాయిలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి ఆ పార్టీ గొప్పదనం కన్నా కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే అధికమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో సారూ–కారూ–పదహారు–ఢిల్లీలో సర్కారూ అన్న టీఆర్‌ఎస్ నినాదం పనిచేయకపోగా, నిజామాబాద్, భువనగిరి, మల్కాజ్‌గిరి సిట్టింగ్ స్థానాలు కోల్పోయి 9 సీట్లకే పరిమితమైందని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎంకు దేశవ్యాప్తంగా మూడు సీట్లే వచ్చాయని, రాష్ట్రంలో ఒక్కసీటు రాకపోవడంతో పార్టీ కేడర్, అభ్యుదయ శక్తులు, వామపక్ష శ్రేయోభిలాషులు నిరాశ, నిస్పృహలకు గురయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థుల గెలుపులో ఎక్కడ లోపం జరిగిందో విశ్లేషించుకుని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని తమ్మినేని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వామపక్షాల అభ్యర్థులకు ఓటేసిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ విధానాలు, మతోన్మాద పోకడలు, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై పోరాడాలని, అందుకు సీపీఎం తన కృషిని కొనసాగిస్తుందని చెప్పారు.