సాక్షి, అమరావతి: సీఎంపై బుధవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, సభ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యకలాపాల్ని అడ్డుకోవడంపై ఒక దశలో సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు బిల్లులపై బుధవారం విపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ నిరాకరిస్తూ చర్చకు అనుమతించారు. అదే సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. టీడీపీ సభ్యుల వైఖరిపై ఒకదశలో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహణకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా వినకుండా ఆందోళనను కొనసాగించారు.
కఠిన చర్యలు తీసుకోవాలి: వైఎస్సార్‌సీపీ సభ్యులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను చూస్తుంటే రక్తం మరిగిపోతోందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వెలిబుచ్చారు. సీఎం వైఎస్ జగన్‌పై కేసులకు టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు కారణం కాదా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు పంది కొక్కుల్లా దోచుకున్న టీడీపీ సభ్యులకు తమ నేతను విమర్శించే అర్హత లేదని.. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్య తీసుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. సభలో అనైతికంగా వ్యవహరించే వాళ్లకు చంద్రబాబు మార్కులేస్తున్నారని మరో ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌కు అవమానం జరిగితే సభ ఊరుకోదనే సంకేతాలు పంపాలని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు స్పీకర్‌ను కోరారు. సభా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని మరో సభ్యుడు అప్పలరాజు స్పీకర్‌కు విన్నవించారు. సభా విలువలు తెలియని గూండాలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారని కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రపై టీడీపీ విషం కక్కుతోందని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేయగా.. సభలో వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంటే బయట వీళ్ళెలా ఉంటారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే వెంకట అప్పలనాయుడు అన్నారు. టీడీపీ తీరు మారకపోతే ఆ పార్టీకి నామరూపాలు ఉండవని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ అన్నారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు చెల్లుబోయిన వేణు, ఆర్కే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సభలో టీడీపీ సభ్యుల వైఖరిని తీవ్రంగా దుయ్యబడుతూ.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు: కొడాలి నాని
రైతు భరోసా కేంద్రాలపై చర్చను అడ్డుకోవడంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వ్యవసాయం దండగన్న వ్యక్తికి రైతు సమస్యలపై మాట్లాడే గొప్ప మనసు ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రైతు భరోసాతో పాటు, సాగునీటి ప్రాజెక్టులకూ ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రైతుల పట్ల తమకున్న చిత్తశుద్ధి అని పేర్కొన్నారు. జోలె పట్టుకోవడం చంద్రబాబుకు అలవాటైందని, సభలో గందరగోళం సృష్టించి వాయిదా వేయించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ రైతు పక్షపాతని, ఆయన తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు రైతన్నకు అండగా ఉంటాయని వైఎస్సార్‌సీపీ సభ్యుడు అబ్బయ్య చౌదరి అన్నారు. రైతుల సంక్షేమం కోసం జరుగుతున్న చర్చను టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
టీడీపీ సభ్యుల కన్నా వీధి రౌడీలే నయం: సీఎం
ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ‘ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ స్థానాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. వాళ్లు పదిమంది కూడా లేరు.. మా వాళ్లు 151 మంది ఓపికతో ఉన్నారు. అయితే పోడియంను చుట్టుముట్టడం.. స్పీకర్‌ను అగౌరవపర్చడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం చేస్తున్నారు. ఇలా చేస్తే ఇటు కూర్చున్న వాళ్ళు రెచ్చిపోరా? సంస్కారం లేని ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇక్కడున్నారు? ప్రజా సమస్యలపై చర్చ జరిగేప్పుడు వీలైతే సలహాలివ్వాలి. లేకపోతే సభకు రాకుండా ఉండాలి’ అంటూ టీడీపీ సభ్యుల తీరును సీఎం తప్పుపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మా వాళ్లు ఆగ్రహంతో స్పందిస్తే దాన్ని వాళ్ల మీడియాలో వక్రీకరించే ప్రయత్నం చేస్తారని తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. ‘దీన్ని కట్టడి చేయాలి. సభాపతి స్థానం వద్ద మెట్లుదాటి ముందుకొస్తే వారిని మార్షల్స్ అటు నుంచి అటే ఎత్తుకుని బయటకు తీసుకుపోయే ఏర్పాటు చేయాలి. లేకపోతే సభలో ప్రజా సమస్యలకు విలువనిచ్చే పరిస్థితి ఉండదు. రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. వీళ్లకన్నా వీధి రౌడీలే నయం. వీధి రౌడీలు కన్పిస్తే ఏరిపారేస్తే తప్ప వ్యవస్థ బాగుపడదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికీ టీడీపీ సభ్యులు వెనక్కి వెళ్లకపోవడంతో.. మార్షల్స్ సాయంతో టీడీపీ సభ్యులను స్పీకర్ వారి స్థానాలకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment