వినతులు ఇవ్వడానికి వచ్చిన వారిపై వేదికపై నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే బండారు, అతని కుమారుడు అప్పలనాయుడు
పెందుర్తి: ‘సార్.. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు.. కానీ నేటికీ అది నెరవేరలేదు.. వరలక్ష్మీనగర్‌లో డంపింగ్ యార్డును తరలించాలి.. చీమలాపల్లిలో శ్మశానవాటిక నిర్మించాలి.. కల్యాణ మండపం ప్రారంభించాలి’ జీవీఎంసీ 70వ వార్డు పురుషోత్తపురంలోని జన్మభూమి వేదికగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఆ వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ముమ్మన వెంకటరమణ విన్నపం.
‘ఏయ్ ఎవరయ్యా మీరంతా.. వైసీపీ వాళ్లు సమస్యల గురించి చెబితే మేం వినం.. ఎవడయ్యా వీళ్లను ఇక్కడికి పంపింది.. పోలీసులూ ఏం చేస్తున్నారు(వారిని దుర్భాషలాడుతూ).. ముందు వైసీపీ వాళ్లందరినీ ఇక్కడి నుంచి ఈడ్చేయండి’ అంటూ ఎమ్మెల్యే బండారు పోలీసులకు ఆదేశం.
‘ఏయ్.. ఫొటోలు కావాలా..రా పంపుతాను.. రాసుకో..రాసుకో..’ అదే వేదిక మీద నుంచి జనం చూస్తుండగా సాక్షి పత్రిక విలేఖరికి ఎమ్మెల్యే బండారు పుత్రరత్నం అప్పలనాయుడు గద్దింపు.
జీవీఎంసీ 70వ వార్డు పురుషోత్తపురంలో శుక్రవారం జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరడానికి వచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులపై కన్నెర్ర చేశారు. ఎన్నికల సమయంలో బండారు ఇచ్చిన హామీలను గుర్తుచేయడంతో పాటు.. ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరడంతో శివాలెత్తిపోయారు. ఏ ప్రతిపక్ష పార్టీలైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. పనిలో పనిగా సాక్షి మీడియాపై కూడా బండారు తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. ఎమ్మెల్యేతో పాటు తన కుమారుడి అవినీతి, అక్రమాలపై ఇటీవల వరుస కథనాలతో నిజాల నిగ్గుతేల్చుతున్న సాక్షిపై ఆయన పరుష వాఖ్యలు చేశారు. ఇదే వేదికపై ఎమ్మెల్యే కుమారుడు అప్పలనాయుడు మరో అడుగు ముందుకేసి అక్కడే ఉన్న సాక్షి విలేకరికి వేలు చూపుతూ.. ‘ఈ గొడవ ఫొటోలు నేనే పంపుతాను.. రాసేయ్.. రాసేయ్’ అంటూ బిగ్గరగా కేకలు వేయడంతో జనం నివ్వెరపోయారు.
వంత పాడిన పోలీసులు
ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదేశాలను పోలీసులు తూ.చ.తప్పకుండా పాటించారు. వేదిక వద్ద నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులను బలవంతంగా బయటకు లాక్కెళ్లిపోయారు. కాసేపటికి రంగప్రవేశం చేసిన పెందుర్తి సీఐ మురళి వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు ముమ్మన వెంకటరమణ, యువజన విభాగం అధ్యక్షుడు కోలా కిరణ్, నాయకులు చిప్పల చందు, జోబ్‌దాస్, సన్నీలను విచారించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ‘తమ పార్టీ వారిని ఎందుకు విచారిస్తున్నారు’ అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఇలాంటి వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు వినను అని చెప్పడం బండారు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ప్రజాక్షేత్రంలో తిరగాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment