20 తర్వాత ప్రచారంలో పాల్గొనాలంట.. | TDP Pressurised Common People For Poll Campaign | Sakshi
Sakshi News home page

లబ్దిదారులపై ఒత్తిళ్లు

Mar 14 2019 10:16 AM | Updated on Mar 28 2019 5:27 PM

TDP Pressurised Common People For Poll Campaign - Sakshi

చోరీ అయిన ప్రభుత్వ డేటా ఇప్పుడు రాష్ట్రంలోని లబ్దిదారులకు ప్రాణ సంకటంగా మారింది.

సాక్షి, అమరావతి : చోరీ అయిన ప్రభుత్వ డేటా ఇప్పుడు రాష్ట్రంలోని లబ్దిదారులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రభుత్వం వద్ద మాత్రమే గోప్యంగా ఉండాల్సిన సంక్షేమ పథకాల లబ్దిదారుల సమాచారం ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల వద్దకు చేరింది. దీంతో వారు తమ ప్రాంతంలో లబ్ధిదారులను కలిసి ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికలయ్యేవరకూ చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయడానికి.. పింఛన్లు పొందే వృద్ధులు, వితంతువులతో పాటు ‘పసుపు–కుంకుమ’ ఇచ్చినందున గ్రామాలు, పట్టణ వార్డుల వారీగా డ్వాక్రా మహిళలు లబ్దిదారులతో గ్రూపులుగా ఏర్పడాలని ఒత్తిళ్లు తెస్తున్నారు.

కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల అధికార పార్టీ నేతల నుంచి ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఏడాది క్రితం రియల్‌ టైం గవర్నెనెన్స్‌ సిస్టం (ఆర్టీజీఎస్‌) శాఖలో సాధికార మిత్రల వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలతో ఓ మొబైల్‌ యాప్‌ తయారైంది. ఇప్పుడా యాప్‌లోని సమాచారం మొత్తం టీడీపీ బూత్‌ కార్యకర్తల సేవామిత్ర యాప్‌ డేటాను పోలి ఉంది. ఇప్పుడీ డేటా మొత్తం టీడీపీ అభ్యర్థుల చేతికి చేరడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

20 తర్వాత ప్రచారంలో పాల్గొనాలంట..
మార్చి 20 నుంచి గ్రామాల వారీగా తాము చెప్పినప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి గ్రూపులు సిద్ధంగా ఉండాలని జిల్లాల్లో టీడీపీ నేతలు హుకుం జారీచేసి వెళ్తున్నారని పలుచోట్ల లబ్ధిదారులు వాపోతున్నారు. పింఛనుదారులు, డ్వాక్రా మహిళలను ఈ ప్రచారంలో భాగస్వామ్యం చేసేందుకు కొంతమంది ప్రభుత్వ సిబ్బంది సైతం అధికార పార్టీ నేతలతో కలిసి లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉన్నతాధికారులు అయితే తమ విభాగాల్లో మండల స్థాయిలో పనిచేసే వారిని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ మౌఖికంగా ఆదేశాలు జారీచేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు.  

వణికిపోతున్న లబ్ధిదారులు
ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వస్తున్న ఒత్తిళ్లతో పింఛనుదారులు, డ్వాక్రా మహిళలు వణికిపోతున్నారు. ‘నిరుపేదలం.. మాకెందుకు ఈ రాజకీయాలన్నా అధికార పార్టీ నేతలు ఒప్పుకోవడంలేదు.. సెర్ప్‌ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నా’రని వారంటున్నారు. ‘రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్లు మంజూరు అవ్వబట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తోంది. మాకెందుకయ్యా ఈ రాజకీయాలు అన్నా వదలడం లేదయ్యా’ అంటూ శ్రీకాకుళం జిల్లాలో ఒక పింఛనుదారుడు వాపోయాడు. ‘ప్రచారం చేయకపోతే పింఛన్లు రద్దు చేస్తామంటున్నారు, భయం వేస్తోంది’ అని అతను కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ప్రచారం చేయకపోతే పింఛను ఇప్పుడే తీసేస్తారని భయంగా ఉందంటూ కృష్ణాజిల్లాలో ఒక లబ్దిదారుడు వాపోయాడు. (చదవండి: సైబర్‌ నేరగాళ్లకు ‘డేటా’..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement