ప్రజాస్వామ్యాన్ని కాపాడండి  | Telangana Congress leaders appealed to the Tamilisai Soundararajan | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి 

Sep 18 2019 2:42 AM | Updated on Sep 19 2019 8:44 PM

Telangana Congress leaders appealed to the Tamilisai Soundararajan - Sakshi

మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు వినతిపత్రం అందజేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. చిత్రంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునేలా మార్గదర్శనం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోరారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష(సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ బృందం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ బృందంలో నల్లగొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య ఉన్నారు. దాదాపు అరగంటపాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు అందజేశారు. గత గవర్నర్‌ నరసింహన్‌ రాజ్యాంగాన్ని కాపాడా ల్సిందిపోయి తానే ఫిరాయింపులకు తెరలేపేలా టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేయించారని చెప్పారు. ఇదే అదనుగా సీఎం కేసీఆర్‌ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారని వివరించారు.

తమ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో విలీనం అవుతున్నామని చెప్పిన ఎమ్మెల్యేలు కూడా ఒకేరోజు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదని, ఒక్కోరోజు ఒక్కొక్కరు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి తాము టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్టు ప్రకటించారని చెప్పారు. దీనిపై తాము అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్లు కూడా ఇచ్చామని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో విలీనం అవుతున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలిచ్చిన పిటిషన్‌ ఆధారంగా సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు బులెటిన్‌ ఇచ్చారని చెప్పారు. తామిచ్చిన పిటిషన్లను పరిష్కరించి ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యే వారని, అప్పుడు 2/3 వంతు మంది సభ్యులు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అంశమే వచ్చేది కాదన్నారు. తమ పార్టీ నుంచి వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇచ్చారని, ఫిరాయింపులపై తాము కోర్టును ఆశ్రయించామన్నారు. టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న ఈ వైఖరి దేశ ప్రజాస్వామానికి ప్రమాదంలా, వైరస్‌లా మారిందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవా లని కోరారు. కాంగ్రెస్‌ నేతల వినతికి స్పందించిన గవర్నర్‌ ప్రతిపక్షంగా చేయాల్సింది కాంగ్రెస్‌ పక్షాన చేయాలని, రాజ్యాంగ పరిధిలో చేయాల్సిన అంశాలను పరిశీలించి ముందుకెళ్తానని అన్నారు.

ప్రజాదర్బార్‌ పెట్టాలని చెప్పాం: భట్టి 
గవర్నర్‌తో భేటీ అనంతరం భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతుందో గవర్నర్‌కు వివరించామని, గవర్నర్‌ స్పందించిన తీరు తమకు సంతృప్తినిచ్చిందని చెప్పారు. ప్రజాదర్బార్‌ నిర్వహించాలన్న గవర్నర్‌ ఆలోచన మంచిదని చెప్పామని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలను, కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులను కలవని పరిస్థితుల్లో గవర్నర్‌ ప్రజలను కలవాలని నిర్ణయించుకోవడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement