ఆమంచి రాజీనామాతో బెంబేలెత్తిన టీడీపీ అధిష్టానం | Ticket Conflicts in TDP Party in Prakasam | Sakshi
Sakshi News home page

చీరాల బరిలో బలరాం?

Published Thu, Feb 14 2019 1:45 PM | Last Updated on Thu, Feb 14 2019 1:45 PM

Ticket Conflicts in TDP Party in Prakasam - Sakshi

పాలేటి, బలరాం, సునీత

సాక్షి ప్రతినిధి,ఒంగోలు: అధికార పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి పోవడం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కావడంతో టీడీపీ అధిష్టానం బెంబేలెత్తి పోయింది. చీరాలలో పరువు నిలుపుకొనేందుకు అప్రమత్తమైంది. చీరాల టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఎమ్మెల్సీ కరణం కుటుంబానికి అప్పగించేందుకు సిద్ధ్దమైంది. కరణం బలరామకృష్ణమూర్తి లేదా ఆయన తనయుడు  కరణం వెంకటేశ్‌లలో ఎవరో ఒకరిని వచ్చే ఎన్నికలలో చీరాల టీడీపీ అభ్యర్థిగా నిలపాలని నిర్ణయించింది. ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోవాలని చంద్రబాబు బలరాంను ఆదేశించినట్లు తెలుస్తోంది. చీరాల నుంచి బలరాం పోటీలో ఉంటేనే బాగుంటుందని జిల్లా టీడీపీ నేతలు సీఎంకు సూచించినట్లు సమాచారం. గురువారం చీరాలలో టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో గురువారం చీరాలలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కరణం, మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో చీరాల అభ్యర్థి ఎంపికపై చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.

సీటు మాకంటే మాకు..
మరోవైపు చీరాల టికెట్‌ తనకే ఇవ్వాలని మాజీ మంత్రి పాలేటి రామారావు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు పార్టీ పెద్దలను కలిసిటికెట్‌ కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. బలరాం కుటుంబానికి పాలేటి సహకరించే పరిస్థితి కూడా లేదు. అటు ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం రాబోయే ఎన్నికలలో తానే పోటీలో ఉంటానని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చీరాల నుంచి ఇద్దరు నేతలు టికెట్‌ కోసం అధిష్టానం పై ఒత్తిడి తెస్తుండగా చంద్రబాబుతో పాటు జిల్లా ముఖ్య నేతలు కరణం కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చీరాలలో గట్టి పట్టు ఉన్న ఆమంచిని ఎదిరించాలంటే కరణం కుటుంబమే పోటీలో ఉండాలని వారు ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం.

ఈ ప్రతిపాదనకు కరణం తొలుత నిరాకరించినట్లు సమాచారం. ఇన్నాళ్లు చంద్రబాబు తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు అవసరానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని కరణం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నాడు తనకు వ్యతిరేకంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారని ఆయన వాదనకు దిగినట్లు సమాచారం. ఇప్పుడు తన అవసరం వచ్చింది కాబట్టి మళ్లీ వాడుకునే ప్రయత్నం మొదలు పెట్టారని, తాను చీరాల నుంచి పోటీ చేయనని కరణం అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు అధిష్టానం దూతలు బుధవారం మధ్యాహ్నం అమరావతి సచివాయంలో కరణంతో చర్చలు జరిపారు.

భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత ఉంటుందని, అన్నీ మీ చేతుల మీదుగానే జరుగుతాయని, మొత్తం సీఎం చూసుకుంటారని వారు బలరాంకు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ  చీరాల బరిలో నిలిచేందుకు అయిష్టత చూపిన బలరాం తాను పోటీలో ఉండలేనని, అక్కడ బీసీ అభ్యర్థిని నిలపాలని సూచించినట్టు తెలిసింది. చంద్రబాబు మాత్రం పోటీలో ఉండాల్సిందేనంటూ బలరాంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. మరి దీనికి ఆయన ఎలా స్పందిస్తారు.. పోటీలో తానే ఉంటారా లేక తనయుడు వెంకటేశ్‌ను నిలుపుతారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బలరాం చీరాల అభ్యర్థిగా నిలిచే పక్షంలో వెంకటేశ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారన్న ప్రచారం ఒక వైపు సాగుతుండగా మరోవైపు ఎమ్మెల్సీ హోదాలోనే బలరాం పోటీలో ఉంటారన్న ప్రచారమూ ఉంది. కుమారుడు వెంకటేశ్‌ భవితవ్యం పైనా బలరాం హామీ తీసుకున్నట్లు తెలుస్తున్నా అది ఏమిటన్నది తెలియాల్సి ఉంది. గురువారం సాయంత్రానికి చీరాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఎమ్మెల్యే ఆమంచి వైఎస్సార్‌సీపీ అ«ధినేత వైఎస్‌ జగన్‌ను కలవడం అనంతరం టీడీపీలో పరిణామాలు బుధవారం జిల్లా వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారాయి.

టీడీపీలో డీలా...
టీడీపీ ముఖ్యనేతలు వరుసబెట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండడంతో జిల్లాలో ఆ పార్టీ డీలా పడింది. టీడీపీకి చెందిన  గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరగా చీరాల సిటింగ్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌ను కలిసి, త్వరలో పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అంతకు ముందే కందుకూరుకు చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ లో చేరగా పర్చూరు కు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్‌లు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు నేతలు సైతం త్వరలో  వైఎస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. దీంతో జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన అభ్యర్థులు దొరికే పరిస్థితి  లేకుండా పోయింది. ఈ పరిణామాలు వైఎస్సార్‌సీపీలో రెట్టించిన ఉత్సాహం నింపగా టీడీపీని డీలా పడేలా చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement