‘బయటి వారికి ఇదే మా హెచ్చరిక!’ | Tribals pathalgadi movement in jharkhand | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 31 2018 2:49 PM | Last Updated on Tue, Jul 31 2018 8:06 PM

Tribals pathalgadi movement in jharkhand - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘బయటి వారికి ఇదే మా హెచ్చరిక! మా గ్రామంలోకి అడుగు పెట్టొద్దు.....ఇక్కడి నేరు, నేల, అడవి మాది....1996 నాటి పంచాయతీ చట్టం ప్రకారం మాకు సంక్రమించిన హక్కులివిగో....’ అన్న ప్రకటనలు ఆ రాష్ట్రంలోని ఏ ఆదివాసి గ్రామానికి వెళ్లినా ఊరి పొలిమేరలోనే పాతిన ఓ రాతి పలక మీద కనిపిస్తాయి. ఇక ఊర్లోకి వెళితే కూడలి వద్ద మరో పెద్ద రాతి పలక కనిపిస్తుంది. దానిపైన ‘భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ ప్రకారం గ్రామ సభే అన్నింటికన్నా సుప్రీం. పార్లమెంట్, అసెంబ్లీ, మరే వ్యవస్థ కూడా దీనికి మించినది కాదు’ అని రాసి ఉంటుంది. జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలో 300లకుపైగా ఆదివాసీ గ్రామాల్లో ఈ హెచ్చరిక రాతి పలకలు కనిపిస్తాయి.

రాష్ట్రంలోని ఆదివాసీలు తమ హక్కుల పరిరక్షిణలో భాగంగా ఈ నెలలో ‘పతాల్‌గడి’ ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ ఉద్యమంలో భాగంగానే వారు ఈ రాతి పలకలను పాతారు. స్థానిక ముండూర్‌ భాషలో ‘పతాల్‌గడి’ అంటే రాతి పలకను నిలబెట్టడం. ఈ ఆదివాసీల గ్రామాల్లో మరో విశేషం కనిపిస్తుంది. హిందీలోకి అనువదించిన భారత రాజ్యాంగం ప్రతి వీధి కొక్కటైనా కనిపిస్తుంది. అక్కడ కాస్త చదువుకున్న ఏ యువకుడిని అడిగినా ఆదివాసీల హక్కుల గురించి, గ్రామ సభలకున్న హక్కుల గురించి అనర్గళంగా మాట్లాడుతారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చింది. చాలాకాలం తర్వాత రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావించారు.

2016 నుంచి రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక ఆదివాసీల హక్కులను  పరిరక్షిస్తున్న 1876 నాటి సంతాల్‌ పరగణ టెనెన్సీ యాక్ట్, 1908 చోటా నాగ్‌పూర్‌ టెనెన్సీ యాక్ట్‌లను సవరిస్తూ జార్ఖండ్‌ అసెంబ్లీ సవరణలు తీసుకొచ్చింది. వాటి ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్‌కు పంపించింది. ఈ రెండు చట్టాల ప్రకారం ఆదివాసీలు తమ  భూములను ఇతర ఆదివాసీలకు మాత్రమే అమ్మాలి. ఆదివాసీలు కాని వారికి అమ్మకూడదు, అమ్మినా చెల్లదు. రాష్ట్ర అభివద్ధి కార్యక్రమాల కోసం, వివిధ ప్రాజక్టుల కోసం వీటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని, ఇతరులకు కేటాయించవచ్చంటూ  బిల్లుల్లో సవరణలు తెచ్చారు. వాటిని రాష్ట్ర గవర్నర్‌ పునర్‌ పరిశీలనకు పంపగా ఆయన వాటిని పునర్‌ పరిశీలించాలని కోరుతూ 2017, ఆగస్టులో తిప్పి పంపారు. ఆ రెండు బిల్లులకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళన చేయడంతో ఆ రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఆ తర్వాత ఆ బిల్లుల స్థానంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘భూసేకరణ బిల్లు–17’ను తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంతో రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు.

రాష్ట్ర జనాభాలో ఇప్పటికీ 28 శాతం మంది ఉన్న ఆదివాసీలు ఈ తాజా బిల్లుకు వ్యతిరేకంగా ‘పతాల్‌గడ్‌’ ఆందోళన చేపట్టారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన 15 మంది ఆదివాసీ నాయకులను పోలీసులు ఆరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. వారిలో ఎక్కువ మందిపై ‘దేశద్రోహం’ కేసులు నమోదు చేశారు. ఉద్యమం సందర్భంగా ఆదివాసీలు మాజీ లోక్‌సభ స్వీకర్, బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు కరియా ముండా ముగ్గురు అంగరక్షకులను కిడ్నాప్‌ చేసి, ఆ తర్వాత విడిచి పెట్టారు. ఉద్యమ కాలంలోనే ఐదుగురు రంగస్థల కళాకారులపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో తమతోపాటు మావోయిస్టులను ఇరికించారని పోలీసులు కుట్ర పన్నారని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారన్న అభియోగంతో మావోయిస్టులను కూడా కేసులో ఇరికించాలని చూస్తున్నారని, నిజంగా తమకు మావోయిస్టుల సానుభూతి తప్ప మద్దతు ఎక్కడా లేదని జార్ఖండ్‌ డిసోమ్‌ పార్టీ అధ్యక్షుడు సల్కాన్‌ ముర్మూ తెలిపారు. మావోయిస్టులు భారత రాజ్యాంగాన్ని విశ్వసించరని, తాము మాత్రం భారత రాజ్యాంగానికి నిక్కచ్చిగా కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.

ఆదివాసీలకు స్థానిక చర్చిలు మద్దతిస్తున్నాయన్న కారణంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆదివాసీల ఆందోళనతో తమకు సంబంధం లేదని, పైగా అభివద్ధిని కోరుకోని ఆందోళనలను తాము వ్యతిరేకిస్తామని ‘సెక్రటరీ జనరల్‌ ఆఫ్‌ ది క్యాథలిక్‌ బిషప్‌–కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఇండియా’ బిషప్‌ తియోదర్‌ మాస్కరెన్హాస్‌ చెప్పారు. తాము మాత్రం భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామని సల్కాన్‌ ముర్మ హెచ్చరించారు. దేశంలో ప్రతి కోట్ల మందికిపైగా ఆదివాసీలు ఉన్నారని, వారంతా ఒక్కటైతే తమ ఆందోళన విజయవంతం అవుతుందని ఆయన చెప్పారు. లేనిపక్షంలో మణిపూర్‌ తరహా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీలు ఆదివాసీ ప్రజా ప్రతినిధులపై తిరుగుబాటు చేయడమే మణిపూర్‌ తరహా ఆందోళన.

ఈ ఉద్యమం ఆదివాసీలు ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి విస్తరిస్తే ప్రమాదమని, పైగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని బీజేపీ అధిష్టానంలో ఆందోళనలో పడింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆదివాసీ ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ వారం అక్కడికి వెళుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement