సాక్షి, అమరావతి: బీసీల సాధికారత, సామాజిక న్యాయం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న వైఎస్సార్ సీపీ వారికి మరోసారి పెద్దపీట వేసింది. వైఎస్సార్ సీపీకి లభించే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండిటిని బీసీలకే కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నిబద్ధతను చాటుకున్నారు. పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పార్టీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ పరిమల్ ధీరజ్‌లాల్ నత్వానీని ఎంపిక చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో పార్టీ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సోమవారం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవడం ఖాయమన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశం ఎవరికి దక్కుతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేశారు.
నమ్ముకున్న వారికి అండగా..
పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులను రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయడం ద్వారా తాను బీసీ పక్షపాతినని, దివంగత వైఎస్సార్ తనయుడిగా నమ్మకున్న వారికి సదా అండగా ఉంటానని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఎమ్మెల్సీగా వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో మండపేట నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో కీలక స్థానం కల్పించారు. ఉపముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా నియమించారు. శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు.
అయోధ్య రామిరెడ్డి సేవలకు గుర్తింపు
ప్రముఖ పారిశ్రామికవేత్త, రాంకీ గ్రూప్ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో సామాజిక సమీకరణాల వల్ల ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉంటూ వచ్చిన ఆయన సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు.
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం నత్వానీకి అవకాశం
విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ ధీరజ్‌లాల్ నత్వానీని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. ముఖేష్ అంబానీ ఇటీవల స్వయంగా తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా నత్వానీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రిని కోరారు.
విధేయతకు పట్టం
బీసీ వర్గానికే చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణారావు కూడా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడే. వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి ఉంటూ వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణారావుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. బీసీలు, పార్టీకి విధేయులుగా ఉన్నవారికి తప్పకుండా గుర్తింపు కల్పిస్తామని రుజువు చేశారు.
రాష్ట్రాభివృద్ధికి దోహదం
బీసీలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేశారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనమండలిలో పార్టీ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వెల్లడించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సగం బీసీలకే కేటాయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ వెనుకబడిన వర్గాల పట్ల నిబద్ధత చాటుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తామని ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రికి మాట ఇచ్చారని తెలిపారు.
చరిత్రలో నిలుస్తుంది..
ముఖ్యమంత్రి జగన్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తారని మరోసారి రుజువైంది. ఒకేసారి ఇద్దరు బీసీ నాయకులను అత్యున్నత సభకు పంపించడం కీలక ఘట్టంగా ఏపీ చరిత్రలో నిలుస్తుంది. నా ఎదుగు దలకు దివంగత వైఎస్సార్ బీజం వేస్తే ఆయన తనయుడు, సీఎం జగన్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం కల్పించారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటా.
–మోపిదేవి వెంకటరమణారావు, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి
ఊహించలేదు..
రాజ్యసభకు వెళతానని కలలో కూడా ఊహించలేదు. విశ్వసనీయతతో పనిచేసే వారికి పార్టీలో కచ్చితంగా సముచిత స్థానం లభిస్తుంది. పెద్దల సభకు ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. బీసీలకు పెద్దపీట వేసింది ఒక్క సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే.
– పిల్లి సుభాష్ చంద్రబోస్, డిప్యూటీ సీఎం
ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నా కృతజ్ఞతలు. ఏపీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తాను. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉంటాను.
–పరిమల్ నత్వానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment