రాజమహేంద్రవరం కల్చరల్: పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ప్రచారాలను మానుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హితవు పలికారు. ఫిల్ ఛానెల్ వద్దకు బస్సుల్లో జనాలను తీసుకువచ్చి ప్రాజెక్టు పనులు అద్భుతంగా జరుగుతున్నాయని తప్పుతోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నేటికీ టన్నెల్స్ లేవు, డిజైన్లు ఖరారు కాలేదు, డ్యామ్ పనులు ప్రారంభం కాలేదు, అలాంటప్పుడు 2019లో నీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. కాంట్రాక్టరు సొంత ఖర్చుతో డంపింగ్ యార్డులను కట్టించి, పోలవరం వద్ద తవ్విన మట్టిని అక్కడికి తరలించాల్సి ఉండగా.. రైతుల పొలాల్లో వదిలేస్తుండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో కోర్టులు ఇచ్చిన స్టేలను కూడా ఖాతరు చేయడం లేదని, పోలీసుల అండతో రైతులపై దౌర్జన్యాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. డంపింగ్ యార్డులను ఎందుకు నిర్మించడం లేదని అడిగే ధైర్యం ప్రభుత్వానికి ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అధిక చెల్లింపులు, ఇతర అంశాలపై కాగ్ లేవనెత్తిన అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.
అమెరికా పర్యటనపైనా అసత్యాలు
ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన చంద్రబాబు ఐక్యరాజ్య సమితి సమావేశానికి వెళ్లినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఉండవల్లి విమర్శించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక అమరావతి బాండ్లు, ఇతర అంశాలపై చర్చకు సిద్ధమేనని కుటుంబరావు ఇటీవల హైదరాబాద్‌లో తనతో చెప్పినట్లు తెలిపారు. పుష్కర మరణాలపై విచారణ జరిపిన సోమయాజులు కమిషన్ సంప్రదాయాలను తప్పుపడుతూ నివేదిక ఇచ్చిందని విమర్శించారు. ‘ఈ లెక్కన ముహూర్తం చూసుకుని పుష్కర స్నానాలు చేసిన సీఎంను తొలి ముద్దాయి, ముహూర్తబలం గురించి చెప్పిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును రెండో ముద్దాయి, మీడియాను మూడో ముద్దాయిగా భావించాల్సి ఉంటుందేమో’నని ఉండవల్లి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
పోలవరంపై అసత్య ప్రచారాలు మానుకోండి
Published Wed, Sep 26 2018 3:45 AM | Last Updated on Wed, Sep 26 2018 8:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment