
రోడ్‌షోలో మాట్లాడుతున్న ఉత్తమ్
హుజూర్‌నగర్: తెలంగాణలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీల పర్యటనతో రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన దేవతగా సోనియా రాష్ట్ర ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా పాలన సాగించిన విధానాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు. దేశం కోసం అనేక త్యాగాలు చేసిన వారిగా గాంధీ కుటుంబం నిలిచిపోయిందని, అలాంటి చరిత్ర ఉన్న కుటుంబాన్ని విమర్శించే నైతిక అర్హత టీఆర్‌ఎస్‌కు లేదన్నారు.
రోజు రోజుకూ ప్రజల్లో ఆ పార్టీకి బలం తగ్గి పోతుండటంతో టీఆర్‌ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో మహాకూటమి మెజార్టీ స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే మేనిఫె స్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్ని తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అట్లూరి హరిబాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్ చావా కిరణ్మయి, ఐఎన్‌టీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌రావు, చిట్యాల అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు.