
సాక్షి, కడప : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీకి వైఎస్సార్ జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వీరశివారెడ్డి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా స్పందనను గమనించకుండా ఓటమిలో బౌండరీలు కొడుతున్న వారికే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని విమర్శించారు.
టీడీపీకి రాజీనామా లేఖను ఇప్పటికే పంపానని చెప్పిన ఆయన...జిల్లా అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఉక్కు కర్మాగారం నిర్మింపజేస్తారని, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. తమ నియోజకవర్గానికి సంబంధించి గాలేరు–నగరి ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయని పేర్కొన్నారు. అభివృద్ధిని కాంక్షించి ఎలాంటి షరతులు లేకుండానే తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు.
రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, సహకార సంఘ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన అనంతరం వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు వీరశివారెడ్డి ప్రకటన చేశారు. తన కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు తమ క్యాడర్ అంతా వైఎస్సార్‌సీపీలో చేరుతుందన్నారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు కొంతమంది ప్రచారం చేశారని, తనకు ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు.