సాక్షి, న్యూఢిల్లీ : ‘ ఓ పోలీసు అధికారి చావుకన్నా ఆవు చావు చాలా ప్రాముఖ్యమైనది’ అని బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా డిసెంబర్ 17వ తేదీన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంపై ఇప్పుడు రాద్దాంతం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆవును చంపారన్న ఆరోపణలపై బజరంగ్ దళ్ కార్యకర్తలు సృష్టించిన హింసాండలో ఓ పోలీసు అధికారి చనిపోయిన ఉదంతం గురించి నసీరుద్దీన్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారిని కాల్చి చంపిన బజరంగ్ దళ్ నాయకుడు యోగేశ్ రాజ్‌ను ఇంతవరకు అరెస్ట్ చేయలేక పోయిన బులంద్‌షహర్ పోలీసులు ఆవును చంపిన కేసులో నలుగురు ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆ నలుగురు ముస్లింలు ఆవును చంపారనడానికి ఎలాంటి ఆధారాలు పోలీసులు సేకరించలేక పోయారు.
ఈ నేపథ్యంలో మతోన్మాద పరిస్థితుల గురించి, నేరం చేసిన తప్పించుకుంటున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ నసీరుద్దీన్ ఓ మనిషి చావుకన్నా చావు ముఖ్యంగా మారిందని విమర్శించారు. ఆవును చంపారన్న ఆరోపణలపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి, పోలీసు అధికారి చావును మాత్రం అదొక ‘యాక్సిడెంట్’ అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో తప్పుకనిపించని మూకలకు ఇప్పుడు నసీరుద్దీన్ మాటల్లో తప్పు కనిపిస్తోంది. నసీరుద్దీన్‌ను పాకిస్థాన్ ఏజెంట్ అంటూ యూపీ బీజేపీ చీఫ్ మహేంద్ర నాథ్ పాండే విమర్శించగా, దేశద్రోహి అంటూ బీజేపీ మిత్రుడు రాందేవ్ బాబా ఆరోపించారు.
మతోన్మాద రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా వారిని పాకిస్తాన్ ఏజెంట్ అనడమో, పాకిస్తాన్ టెర్రరిస్టుతో పోల్చడమో మతోన్మాద నాయకులకు కొత్తకాదు. ఇంతకుముందు ఇదే యోగి ఆదిత్యనాథ్, దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ హఫీద్ సయీద్‌తో పోల్చారు. దేశంలో అసహన పరిస్థితులు పెరుగుతున్నాయన్నందుకు మరో నటుడు ఆమిర్ ఖాన్‌ను కూడా మతోన్మాద మూకలు విమర్శించాయి. పర్యావసానంగా ఆమిర్ ఖాన్ కొన్ని కోట్ల రూపాయల యాడ్ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నసీరుద్దీన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు మొన్న శుక్రవారం నాడు ‘అజ్మీర్ సాహిత్య వేడుకల్లో’ నిర్వాహకులు ఆయన పాల్గొనాల్సిన సెషన్‌ను రద్దు చేశారు. ఎంత రాజకీయమైనా ఇంత అసహనం పనికి రాదు!
Comments
Please login to add a commentAdd a comment