సాక్షి, పెందుర్తి : వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్ర శనివారం పెందుర్తిలోని 46, 49 వార్డుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిపై విమర్శలు గుప్పించారు. బండారు ముదుపాక గ్రామంలో దళితులకు చెందిన వందలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. వామపక్షలతో కలిసి వాటిని అడ్డుకున్నామని, వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు. నియోజక వర్గంలో ఎమ్మెల్యే, ఆయన కుమారుడు, అనుచరుల దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. జెర్రిపోతుల పాలెం గ్రామంలో మహిళను వివస్త్రనుచేసి దారుణాలకు పాల్పడ్డారని, బాధితురాలికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇప్పిస్తామని చెప్పి మొండి చేయి చూపించారని విమర్శించారు.
దళితులపై దౌర్జన్య కాండకు పాల్పడే బండారుకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని విజయ సాయిరెడ్డి అన్నారు. హిందూజా పవర్, ఫార్మాసిటీ, ఎన్టీపీసీల్లో స్థానికులకు ఉద్యోగాలు కల‍్పించలేక పోయారని విమర్శించారు. గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించారని గుర్తు చేశారు. డిగ్రీ చదివే విద్యార్థుల కోసం పెందుర్తిలో డిగ్రీ కాలేజీ ఎందుకు నిర్మించలేక పోయారని నిలదీశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్లలో 3లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి తులసి వనంలో గంజాయి మొక్క అని విజయ సాయి రెడ్డి విమర్శించారు. ఏప్రిల్‌లో బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పూలే, దాదా సాహెబ్ అంబేడ్కర్ లాంటి గొప్ప మహానుభావులు పుడితే, అదే నెలలో చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి నాయకుడు పుట్టారంటూ విమర్శించారు. అందుకే తులసి వనంలో చంద్రబాబు గంజాయి మొక్క అని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకొనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటూ అది చంద్రబాబే అంటూ దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా చంద్రాబాబు రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరిని మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేక పోయిన నీతిమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment