
సాక్షి, హైదరాబాద్: నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టడం శుభపరిణామమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఐదేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రతిపక్షాలు ఆధారాలతోసహా బయటపెట్టినా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు నిన్న (బుధవారం) ప్రకటన విడుదల చేశారు.
అవినీతి ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసులు పెడతామని బెదిరించిన నేపథ్యంలో కేసీఆర్ పాలనపై కేంద్రం నిఘా పెట్టిందని, అవకతవకలపై సమాచారం సేకరిస్తుందని బీజేపీ నేతలు ప్రకటించడాన్ని రాష్ట్ర ప్రజలు మంచి పరిణామంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఏం చేసినా అడిగే నాథుడు లేడన్న బరితెగింపుతో వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను కట్టడి చేసే రోజు కోసం ప్రజానీకం ఎదురుచూస్తోందని అన్నారు. కేవలం నిఘాతో సరిపెట్టకుండా టీఆర్‌ఎస్ పాలనలో అవకతవకలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేస్తే బంగారు తెలంగాణ పేరుతో ఆడుతున్న నాటకానికి తెరపడుతుందని ఆమె పేర్కొన్నారు.