‘ఓటు’ దూరం..!  | Vote Turnout Politics In West Godavari | Sakshi
Sakshi News home page

‘ఓటు’ దూరం..! 

Published Fri, Mar 8 2019 3:42 PM | Last Updated on Fri, Mar 8 2019 3:46 PM

Vote Turnout Politics In West Godavari - Sakshi

శనివారపుపేటలో చిరునామాలు తారుమారైన ఓట్లు

ఏలూరు రూరల్‌: ఎన్నికల అధికారులు టీడీపీ నేతల గుప్పెట్లో బందీలయ్యారు. వారు చెప్పింది, చెప్పినట్టుగా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆదేశాల మేరకు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులు, ఎస్సీ వర్గానికి చెందిన వారి ఓట్ల చిరునామాలు మార్చేస్తున్నారు. దూరపు పోలింగ్‌బూత్‌ల పరిధిలో చేర్చుతున్నారు. ఫలితంగా పోలింగ్‌ బూత్‌ దూరమైతే అంతదూరం వెళ్లి ఓటు వేయరనే కుయుక్తితోనే ఇలా చేస్తున్నారనే వాదన వ్యక్తమవుతోంది.   

ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ బూరాయిగూడెంకు చెందిన కాకి రత్నప్రత్యూష ఇటీవల ఓటు కోసం ఆన్‌లైన్‌లో దరకాస్తు చేసుకున్నారు. ఈమెకు వెంకటాపురం పంచాయతీ సుంకరవారిగూడెం చిరునామాతో ఓటు మంజూరైంది. ఆన్‌లైన్‌లో పరిశీలించుకున్న ప్రత్యూష మరోసారి చిరునామా మార్పునకు దరఖాస్తు చేశారు. ఈసారి ఏకంగా తంగెళ్లమూడి పంచాయతీ బీడీకాలనీని చిరునామాగా పేర్కొంటూ అధికారులు ఓటు మంజూరు చేశారు. దీనిపై అనుమానం వచ్చి పలువురు బూరాయిగూడెం వాసులు ఓటర్ల జాబితా పరిశీలించగా, చాలా చిరునామాలు తారుమారైనట్టు గుర్తించారు. 

మరిన్ని ఆధారాలు ఇవిగో.. 

గత 30 ఏళ్ళుగా బూరాయిగూడెంలో నివాసం ఉంటూ ఓటు వేస్తున్న కొట్టె అవ్వమ్మ ఓటు ఈ సారి ఏలూరు నగరం సెయింట్‌ గ్జెవియర్‌ స్కూల్‌ బూత్‌కు బదిలీ అయ్యింది. 

- వాసే వెంకటేశ్వరరావు ఓటు సైతం తారుమారైంది. 
- నాలుగు నెలల క్రితం దాకారపు మాణెమ్మ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదు. 
వీటిపై వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నాయకులు, స్థానిక యువకులు విచారణ చేయగా ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.

టీడీపీ నేతల ఇళ్ల వద్దే పరిశీలన 

వాస్తవానికి ప్రజలు ఓటుకు దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల అధికారి ద్వారా ఏరియా సూపర్‌వైజర్‌కు అది చేరుతుంది. సూపర్‌వైజర్‌తో పాటు బూత్‌లెవెల్‌ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుడు చిరునామా నిర్ధారించుకుని ఓటు మంజూరుకు ఉన్నతధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ  క్షేత్రస్దాయి పరిశీలనకు వెళుతున్న సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు స్థానిక టీడీపీ నాయకుల ఇళ్లకు చేరుకుంటున్నారు.

వారికి దరఖాస్తుదారుడు వివరాలు చెబుతున్నారు. దీన్ని గ్రహించిన టీడీపీ నేతలు దరఖాస్తుదారుడు తమ పార్టీకి వ్యతిరేకమా, అనూకూలమా గుర్తించి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. దీన్ని తీసుకుంటున్న ఎన్నికల అ«ధికారులు అదే సమాచారం ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. ఇలా టీడీపీ నాయకులు తమకు వ్యతిరేకమైన ఓటర్ల చిరునామాలు మార్చేస్తున్నారు. దూరాన ఉన్న బూత్‌లకు బదిలి అయ్యేలా కుట్రలు చేస్తున్నారు.

ఫలితంగా ఓటరు విసిగి చెంది ఓటు వేయకుండా ఉంటాడని భావిస్తున్నారు. మరోపక్క మండలంలో కొందరు ఎన్నికల అధికారులు ఫారం–6లను తీసుకుని పంచాయతీ, వీఆర్వో కార్యాలయాల వద్ద కూర్చుని దరఖాస్తుదారుడుకు ఫోన్‌ చేసి నిర్ధారించుకుంటున్నారు. దరఖాస్తుదారుడు ఫోన్‌కు స్పందించకపోతే అధికారులు తమ ఇస్టానుసారం మార్చేస్తున్నారు. ఫలితంగా మండలంలో వెంకటాపురం, తంగెళ్లమూడి, శనివారపుపేట తదితర గ్రామాల్లో ఓటర్ల చిరునామాలు పెద్ద సంఖ్యలో తారుమారయ్యాయి. 

మూడుసార్లు చిరునామా మార్చుకున్నా 

ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏ «అధికారీ మా ఇంటికి వచ్చి పరిశీలన చేయలేదు. నా వివరాలు సేకరించలేదు. మరి నాకు ఓటు ఎలా మంజూరు చేశారో తెలియడం లేదు. ఓటర్‌ ఐడీలో చిరునామా మార్పు కోసం ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నాను. మొదటసారి సుంకరవారిగూడెం అడ్రస్‌తో ఓటు వచ్చింది. తర్వాత బీడీకాలనీలో వచ్చింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో నా ఓటు పరిశీలిస్తే రెండు చిరునామాల్లో ఓటు ఉన్నట్టుగా కనిపిస్తోంది. నేను ఓటు ఎక్కడ వేయాలి.   
– కాకి రత్నప్రత్యూష, బూరాయిగూడెం

నేను ఉంటున్న చోటే ఓటు కావాలి 

కొన్నేళ్ళుగా నేను, నా భర్త బూరాయిగూడెంలో ఉంటున్నాం. ఎంతోకాలంగా సాయినగర్‌ బూత్‌ నెంబర్‌ 184లో ఓటు వేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మా ఓట్లు ఏలూరు సెయింట్‌ గ్జేవియర్‌లో బూత్‌నెంబర్‌ 48లో ఉన్నట్లు చూపుతున్నారు. ఓటు కోసం అంతదూరం ఎలా వెళ్లగలం. ఉన్న చోటే మాకు ఓటు కావాలి. దరఖాస్తు చేసుకోవడం మాకు తెలియదు. ఏం చేయాలి.                 
– వాసా ఏడుకొండలు, స్థానికురాలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement