న్యూఢిల్లీ: పాకిస్తానీయులందరికీ భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విసిరిన సవాలుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ‘పాకిస్థాన్ పౌరసత్వం గత వ్యక్తులకు మేం ఎందుకు భారత పౌరసత్వం ఇస్తాం. ప్రతిపక్షాలకు ఇలాంటి సవాళ్లు విసరడంలో అంతరార్థం ఏమిటి’ అని ఆయన ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘దేశ యువత, విద్యార్థులు ఉదార, లౌకికవాద, సహనశీల దృక్పథాన్ని కనబర్చడం, మానవతావాదాన్ని ప్రదర్శిస్తుండటం ఆనందం కలిగిస్తోందని పేర్కన్నారు. ఈ ఉన్నతమైన విలువలను ప్రభుత్వం సవాలు చేయదల్చుకుందా?’ అని ఆయన ప్రశ్నించారు.
పాకిస్తానీయులందరికీ భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?.. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించి, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసే ధైర్య సాహసాలు ఆ పార్టీకి ఉన్నాయా అని ఉద్దేశించి మంగళవారం జార్ఖండ్‌లో ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ సవాలు విసిరిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టంతో భారత్‌లో పౌరులకు ఎలాంటి హాని జరగదని ఆయన పునరుద్ఘాటించారు. జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసు చర్యల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్ర వలలో విద్యార్థులు చిక్కుకోవద్దని హితవు పలికారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్బన్ నక్సల్స్, ఇతర రాజకీయ పార్టీలు విద్యార్థుల భుజం మీద తుపాకీ ఉంచి కాల్చడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ అంశంలోనైనా ప్రభుత్వంతో ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరపవచ్చునని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment