
రాయ్‌పూర్ : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరిగి విజయాన్ని సాధిస్తుందని ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాయ్‌పూర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన సీఎం పలు అంశాలను ప్రస్తావించారు. గడిచిన పదేళ్లల్లో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టామని, తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని రమణ్ సింగ్ అన్నారు. గడిచిన ఐదేళ్లల్లో దేశంలో బీజేపీ అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని చెప్పారు.
ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టామని కేంద్రంలో కూడా తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలకు విశేష స్పందన వస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో కరెంట్, మంచినీరు, విద్య, రోడ్డు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచామని తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 స్థానాల్లో 10 స్థానాలు తమ పార్టీ విజయం సాధించిందని అవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నారు.
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాల ఓటమిపై సీఎం స్పందిస్తూ.. ప్రజల ఆలోచనలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవని, ఉప ఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బీజేపి ప్రభుత్వాలు తప్పక ఏర్పాటు చేస్తుందని రమణ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు.