సాక్షి, పశ్చిమ గోదావరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదివారం ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉండబోతోందని వైఎస్సార్ సీపీ బీసీ నేతలు వ్యాఖ్యానించారు. శనివారం ఏలూరు బీసీ గర్జన ప్రాంగణం వద్ద వైఎస్సార్ సీపీ బీసీ నేతలు పార్థసారధి, జంగా కృష్ణమూర్తి, కారుమూరి నాగేశ్వర రావు, మేకా శేషుబాబు, నరేశ్ గౌడ్‌లు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ సీపీ కమిటీని నియమించిందని తెలిపారు. సంవత్సరంన్నర ముందుగానే కమిటీ బీసీల జీవన స్ధితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేసిందన్నారు. సంచార జాతులకి కూడా మేలు చేసే విధంగా వైఎస్సార్ సీపీ నిర్ణయాలు ఉంటాయన్నారు. బీసీలకు మేలు చేయడానికి వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని మండిపడ్డారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బీసీలకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు బీసీలకు అరకొర తాయిలాలు ప్రకటించి మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. 14 బీసీ కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసినా సరైన విధానాలు లేవని చెప్పారు. చంద్రబాబు మళ్లీ బీసీలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్దితో వైఎస్ జగన్ ఉన్నారన్నారు. బీసీల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ కృతనిశ్చయంతో ఉందని వెల్లడించారు.
ఆదివారం జరగబోయే బహిరంగ సభలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. చంద్రబాబుకు బీసీలపై ప్రేమ లేదన్నారు. బీసీలు ఎవరు కలిసి ఏమీ అడిగినా చంద్రబాబు తోక కత్తిరిస్తానంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. బీసీలు మాకు వెన్నెముక అంటూ ప్రతీ ఎన్నికలలో చంద్రబాబు మాయ చేస్తున్నారు. చంద్రబాబు మాయలను ఈసారి బీసీలు నమ్మే పరిస్ధితి లేదు. వైఎస్సార్ సీపీ బీసీ గర్జన సభను పరిశీలన చేయాలని రాష్ట్రంలోని బీసీలకు సూచన. ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజమండ్రిలో జయహో బీసీ అంటూ చంద్రబాబు మరో మోసానికి తెరలేపారు. బీసీలను అవమానించింది చంద్రబాబు కాదా. నాయీ బ్రాహ్మణులతో పాటు బీసీ కులాలను తోలు తీస్తా అన్నది చంద్రబాబు కాదా.
‘ఎస్సీలలో ఎవరు పుట్టాలని కోరుకుంటారు’ అని చంద్రబాబు అవమానించలేదా. రాష్ట్రంలో ఇసుక సంపదను దోచుకున్నారు. వైఎస్ జగన్ ద్వారా బీసీల భవిష్యత్ మారబోతోంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో బీసీలకు సంక్షేమ పధకాలు అందాయి. బీసీలకు మేలు చేయాలన్న వైఎస్సార్ ఆలోచనల మాదిరే నేడు వైఎస్ జగన్ ఆలోచనలున్నాయి. రాజకీయంగా, సామాజికంగా , ఆర్ధికంగా బలహీన వర్గాలను ప్రోత్సహించాలనే ఆలోచన వైఎస్సార్ సీపీది. రాబోయే కాలంలో బీసీలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు. బీసీ కుల వృత్తులను కూడా కార్పోరేట్లకు తాకట్టు పెడుతున్న వ్యక్తి చంద్రబాబ’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment