సాక్షి, పూతలపట్టు (చిత్తూరు జిల్లా) : చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే చాలు.. సహకార రంగంలోని ఫ్యాక్టరీలు మూతబడుతాయని, అందుకు తాజా నిదర్శనం చిత్తూరు జిల్లాలోని చక్కర ఫ్యాక్టరీలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు తీరు కారణంగా చిత్తూరు జిల్లాలో సహకార రంగంలో ఉన్న రెండు చక్కర ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. అదేవిధంగా చిత్తూరు పాలడైరీని కూడా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు మూసివేయించారని, తన హెరిటేజ్ పాల ఫ్యాక్టరీకి లాభాల కోసం చిత్తూరు డైరీని పద్ధతి ప్రకారం మూతపడేలా చేశారని ధ్వజమెత్తారు. రైతుల జీవితాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు పెట్టుకున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు చేరుకున్న వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు వైఎస్ జగన్‌కు నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు.
ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు..!
‘పొద్దుటి నుంచి ఇవాళ ఎండను ఖాతరుచేయకుండా, నడిరోడ్డును ఖాతరు చేయకుండా వేలమంది నాతోపాటు అడుగులో అడుగు వేశారు. ఒకవైపు కష్టాలూ, బాధలూ నాతో చెప్పుకుంటూనే మరోవైపు నన్ను భుజం తట్టి అండగా నిలిచి తోడుగా నడిచారు. చెరగని చిరునవ్వుతో ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, ఆత్మీయతలు చూపుతున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని వైస్ జగన్ అన్నారు.
చక్కర ఫ్యాక్టరీలు మూతబడే పరిస్థితి..!
'ఇవాళ పూతలపట్టు నియోజకవర్గానికి పక్కనే చిత్తూరు చక్కర ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆరు చక్కర ఫ్యాక్టరీలు ఉండగా.. చిత్తూరు, రేణిగుంట చక్కర ఫ్యాక్టరీలు సహకార రంగంలో ఉన్నాయి. మిగతా నాలుగు ప్రైవేటు రంగంలో ఉన్నాయి. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా.. సహకార రంగంలో ఉన్న చక్కర ఫ్యాక్టరీలు మూతబడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రైవేటు రంగంలోని ఫ్యాక్టరీలు మాత్రం లాభాల్లో నడుస్తున్నాయి. నిజానికి సహకార రంగంలోని చక్కర ఫ్యాక్టరీలు నడిచేలా ముఖ్యమంత్రి చూడాలి. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు ఇవి కృషి చేస్తాయి. అప్పుడు ప్రైవేటు ఫ్యాక్టరీలు కూడా పోటీపడి.. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ప్రయత్నిస్తాయి.
కానీ చంద్రబాబు తన సొంత జిల్లాకు చెందిన రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. సహకార రంగంలోని ఫ్యాక్టరీలు మూతపడేలా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ రెండు చక్కర ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. దివంగత నేత వైఎస్సార్ తన హయాంలో సహకార రంగంలోని చక్కర ఫ్యాక్టరీలకు బకాయిలు చెల్లించి మళ్లీ తెరిపించారు. ఆ ఫ్యాక్టరీలు పదేళ్లు నడిచాయి. రైతులకు లాభం చేకూరింది. కానీ చంద్రబాబు సీఎం కాగానే రెండు చక్కర ఫ్యాక్టరీలు మూతబడే పరిస్థితుల నెలకొన్నాయి. ఒకవైపు రైతులు పంటలు పండించడానికి పంట పండించడానికి పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోంది. మరోవైపు సహకార రంగంలోని ఫ్యాక్టరీలు మూతబడుతుండటంతో గిట్టుబాటు ధర అందక రైతులు చివరకు చెరకు పంటకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది. రైతులకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రైవేటు చక్కర ఫ్యాక్టరీలకు పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు బెల్లం చేసుకొని ఎక్కువ లాభాలు తెచ్చుకోవాలని భావిస్తున్నా చంద్రబాబు సర్కారు అడ్డుపడుతోంది. నల్లబెల్లం అంటూ రైతన్నలను నాశనం చేసే కార్యక్రమం పెట్టుకుంది. భూమిని బట్టి నల్లబెల్లం లేదా తెల్లబెల్లం పండుతుందన్న విషయం ఈ చంద్రబాబుకు తెలియదా? రైతులు బెల్లం తయారుచేసుకొని లాభాల పొందకుండా సీఎం అడ్డుపడుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
చిత్తూరు డైరీ.. పద్ధతిప్రకారం మూసివేశారు!
సీఎం చంద్రబాబు రైతులకు తోడు ఉండాల్సిందిపోయి.. తన సొంత కంపెనీ హెరిటేజ్ ఫ్యాక్టరీకి లాభాల కోసం చిత్తూరు డైరీని ఓ పద్ధతి ప్రకారం మూసివేయించారని వైఎస్ జగన్ ఆరోపించారు. చిత్తూరు డైరీ పాలకమండలిలో తనకు కావాల్సిన వ్యక్తులు నియమించుకొని.. ఒక పద్ధతి ప్రకారం డైరీకి పాలు పోసే రైతులకు పేమెంట్లు ఆపేశాడని, దీంతో గత్యంతరం లేకు హెరిటేజ్ డైరీకి రైతులు పాలు అమ్మడం మొదలుపెట్టారని వివరించారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ కోసమే దుర్భుద్ధితో చంద్రబాబు దగ్గర ఉండి చిత్తూరు డైరీని మూసేసే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.
ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
- తనకు ఓట్లేయకపోతే ప్రజలే సిగ్గుపడాలని చంద్రబాబు అంటున్నారు
- నాలుగేళ్లలో ఏం చేశారని చంద్రబాబుకు ఓట్లేయాలి
- చంద్రబాబు పాలన అంతా మోసం, అవినీతి, అబద్ధం మాత్రమే
- పైస్థాయిలో చంద్రబాబు దోచుకుంటుండగా.. కిందిస్థాయిలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకుంటున్నాయి
- విద్యుత్, ఆర్టీసీ చార్జీలను మూడుసార్లు పెంచారు
- ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పెట్రోల్ ధరలు పెరిగాయి
- తమిళనాడులో మనకంటే రూ. 7 తక్కువగా పెట్రోల్ దరల ఉండగా.. కర్ణాటకలో రూ. ఐదున్నర తక్కువగా ఉన్నాయి
- పేదలకు మేలు చేసిన ఘనత వైఎస్సార్‌దే
- పేదలు ఉన్నత చదువులు చదవాలని వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేశారు
- ఈ పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు నీరుగారుస్తున్నారు
- రూ. లక్ష వరకు ఫీజులు ఉండగా.. చంద్రబాబు రూ. 30వేలే చెల్లిస్తున్నారు
- అది కూడా ఏడాదిన్నరగా రావడం లేదు
- మనం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా చెల్లిస్తాం
- విద్యార్థుల ఖర్చుల కోసం ఏటా రూ. 20వేల చొప్పున చెల్లిస్తాం
- పిల్లలను బడులకు పంపితే ప్రతి తల్లికి ఏటా రూ. 15వేలు ఇస్తాం
- అవ్వా, తాలకు నెలకు రూ. 2వేల చొప్పున పింఛన్ ఇస్తాం
- పింఛన్ వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే రూ. 2వేల చొప్పున పెన్షన్ అందిస్తాం
- ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం.. అక్కాచెల్లెమ్మల పేరిట ఆ ఇళ్లను రిజిస్టర్ చేయిస్తాం
- ఎన్నికలనాటికి ఎంత మొత్తం రుణం ఉంటే.. అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా డ్వాక్రా మహిళలకే చెల్లిస్తాం
Comments
Please login to add a commentAdd a comment