
అక్రమాలకు చంద్రబాబు పర్మిషన్ ఇస్తే లోకేష్‌బాబు కమిషన్ వసూలు చేస్కుంటాడని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
సాక్షి, సబ్బవరం : చంద్రబాబుకు విశాఖ భూములపై కన్ను పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బాబు గజానికో కబ్జాకోరును తయారు చేశారని నిప్పులు చెరిగారు. 255వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సబ్బవరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అక్రమాలకు పెదబాబు పర్మిషన్ ఇస్తే చినబాబు కమిషన్ వసూలు చేస్కుంటాడని ధ్వజమెత్తారు. రికార్డుల తారుమారుతో పెందుర్తిలో పేదవాడి అసైన్డ్ భూములను లాకున్నారని ఆరోపించారు.
అమ్మకానికి వీలులేని లేని అసైన్డ్ భూములను చంద్రబాబు బీనామీలతో తక్కువ ధరకే కొనుగోలు చేయించారని అన్నారు. అనంతరం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను లాక్కుని ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. మళ్లీ అవే భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్తున్న బాబు దారుణమైన పాలనపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. భూ దందాలు చేస్తున్న టీడీపీ నాయకులకు తండ్రి చంద్రబాబు, కొడుకు లోకేష్ బాబు అండదండలు దండిగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న అన్ని స్కాముల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పెదబాబు, చినబాబుల పాత్ర ఉందని విమర్శించారు.
సబ్బవరం బహిరంగ సభలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. దేశం మొత్తంలో 16 లా యూనివర్సిటీలు ఉండగా.. ఏపీలో ఒక యూనివర్సిటీ ఉండాలని దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టుబట్టారని ఆయన తెలిపారు. వైఎస్ చొరవతో సబ్బవరంలో దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ ఏర్పాటైందని వెల్లడించారు. పెందుర్తి నియోజకవర్గంలో మహిళపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్టీపీసీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఎన్నో గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా చంద్రబాబుకు పట్టడం లేదనీ, అధికారంలోకి రాగానే ఎన్టీపీసీ సమస్యను పరిష్కరిస్తామని వైఎస్ జగన్ వెల్లడించారు.
పరిశ్రమల్లోని ఉద్యోగాలు స్థానికులకే..
ఫార్మాసిటీ వంటి భారీ పరిశ్రమలు ఉన్నా స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదని అన్నారు. 75 శాతం ఉంద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అధికారంలోకి రాగానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. రాష్ట్రంలో పాలన లేదని విమర్శించారు. వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందనీ, సహకారం రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు రుణమాఫీ ఏమైంది..?
అధికారంలోకి రాగానే రైతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలనలో ప్రజారోగ్యం అటకెక్కిందని అన్నారు. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్య శ్రీ సేవల్ని అనుమంతించకపోవడం దారుణమన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం సింగపూర్‌లో పంటి వైద్యం చేయించుకుంటారని ఎద్దేవా చేశారు.
