సున్నా వడ్డీకి చంద్రబాబు ఎగనామం | YS Jaganmohan Reddy Slams On Chandrababu Over Zero Interest Loans To Farmers | Sakshi
Sakshi News home page

సున్నా వడ్డీకి చంద్రబాబు ఎగనామం

Published Sat, Jul 13 2019 3:37 AM | Last Updated on Sat, Jul 13 2019 12:39 PM

YS Jaganmohan Reddy Slams On Chandrababu Over Zero Interest Loans To Farmers - Sakshi

సాక్షి, అమరావతి : ‘సున్నా వడ్డీ రుణాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను పూర్తిగా దగా చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రైతులకు సున్నా వడ్డీ రుణాల కోసం రూ.11,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.630 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంటే కేవలం 5 శాతం మాత్రమే ఇచ్చి తామేదో 100 శాతం ఇచ్చామన్నట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాల కోసం రూ.3,036 కోట్లు చెల్లించాల్సి ఉండగా పూర్తిగా ఎగ్గొట్టింది. వ్యవసాయ రుణాల మాఫీ కోసం రూ.87,612 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. చంద్రబాబు నిర్వాకంతో రైతులు, అక్క చెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయారు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం టీడీపీ సభ్యులు సున్నా వడ్డీ పథకంపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు.

ఈ అంశంపై గురువారమే చర్చ ముగిసినందున దానిపై ఇక చర్చించేది లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ రైతులకు సంబంధించిన విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉన్నందున ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ సభ్యులు చెప్పాల్సిన విషయాలు చెప్పాక తాము పూర్తి ఆధారాలతో సహా సమాధానం చెప్పి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామంటూ చర్చకు అనుమతివ్వాలని కోరారు. ఇందుకు స్పీకర్‌ అనుమతించగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులు సున్నా వడ్డీ పథకంపై సూటిగా స్పందించకుండా కేవలం ప్రభుత్వంపై విమర్శలకే  ప్రాధాన్యమిచ్చారు. సున్నా వడ్డీ పథకాన్ని తాము పూర్తిగా అమలు చేయలేదని చంద్రబాబు చెప్పిన గణాంకాలే వెల్లడించాయి. అనంతరం ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమాధానమిస్తూ చంద్రబాబు ప్రభుత్వ తీరును ఆధారాలతో సహా ఎండగట్టారు. తన ప్రసంగానికి టీడీపీ సభ్యులు పలుమార్లు అడ్డుపడినప్పటికీ సున్నా వడ్డీ పథకం గత ఐదేళ్లలో అమలైన తీరును గణాంకాలతో సహా వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఇలా సాగింది.
 
బాబు గొప్పలు చెప్పుకుంటున్నారు 
‘సున్నా వడ్డీ పథకాన్ని గొప్పగా అమలు చేసినట్లు.. అందుకు జాతీయ స్థాయిలో ప్రశంసలొచ్చినట్లు చంద్రబాబు చెబుతున్నారు. దానికి తోడు ఆయనకు ఎల్లో మీడియాలో ప్రాతినిధ్యం ఉంది. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా తానా అంటే వాళ్లు తందానా అంటారు. కానీ వాస్తవాలు ఏమిటో ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. ఇవి టీడీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేసిన రికార్డులే. (చేతిలో డాక్యుమెంట్‌ చూపిస్తూ) దీని ప్రకారం 2014–15లో రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.29,658 కోట్లు. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం రూ.1,186 కోట్లు ఇవ్వాలి. ఆ మొత్తాన్ని ఇస్తేనే బ్యాంకులు సున్నావడ్డీ రుణాలను ఇస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.44.31 కోట్లు మాత్రమే. 2015–16కు గాను రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.57,085 కోట్లు. సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.2,283 కోట్లు. కానీ ఈ పెద్దమనిషి ఇచ్చింది కేవలం రూ.31 కోట్లు మాత్రమే. 2016–17లో రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.58,840 కోట్లు కాగా, సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.2,354 కోట్లు.

కానీ చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.249 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2017–18, 2018–19లో సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదని చంద్రబాబే నిన్న (గురువారం) విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. కానీ నేను రికార్డులు పరిశీలించి చూడగా, ఆయన కేవలం కొంత ఇచ్చినట్లు తెలిసింది. ఆ లెక్కలూ చెబుతాను. 2017–18లో రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.67,568 కోట్లు. సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.2,703 కోట్లు కాగా, ఇచ్చింది కేవలం రూ.182 కోట్లే. 2018–19లో రైతులకు ఇచ్చిన పంట రుణాలు రూ.76,721 కోట్లు. సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.3,069 కోట్లు కాగా, ప్రభుత్వం ఇచ్చింది రూ.122 కోట్లు మాత్రమే. అంటే ఐదేళ్లలో సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.11,595 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.630 కోట్లే. ఆ మాత్రం ఇచ్చి తామేదో సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా అమలు చేశామని, రైతులు సంతోషంగా కేరింతలు కొడుతున్నారని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు.
 
రూ.లక్ష అప్పునకు రూ.5 వేలు ఇస్తే సరిపోతుందా? 
సున్నా వడ్డీ పథకం కోసం చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5 శాతం మాత్రమే చెల్లించింది. కానీ తామేదో సున్నా వడ్డీ పథకాన్ని వంద శాతం కచ్చితంగా అమలు చేశామన్నట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆయన తీరు ఎలా ఉందంటే.. ఉదాహరణనకు మన నారాయణస్వామి అన్న రూ.లక్ష అప్పు తీసుకుని.. తర్వాత రూ.5 వేలు చెల్లించేసి.. అప్పు పూర్తిగా తీరిపోయింది.. ఇక నేనుబాకీ లేను.. అంటే కుదురుతుందా? కానీ చంద్రబాబు తీరు మాత్రం అలానే ఉంది. పైగా చంద్రబాబు బుకాయిస్తూ సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.  
దమ్మిడీ ఇవ్వలేదంటే...  
మామూలుగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు దమ్మిడీ ఇవ్వలేదు అంటాం. రూపాయి ఇవ్వలేదు అంటాం. దమ్మిడీ ఇవ్వలేదంటే దానర్థం దమ్మిడీ అని కాదు. లక్ష రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను 2 రూపాయలు ఇచ్చాను.. అది దమ్మిడీ కంటే ఎక్కువే కదా.. కాబట్టి నేను ఇచ్చేశాను అని చెప్పినట్లు ఉంది చంద్రబాబు తీరు. 5 శాతం చెల్లించేసి 95 శాతం ఎగ్గొట్టేస్తే సరిపోతుందా? పైగా దీనికి తామేదో సున్నావడ్డీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేశామని చెప్పుకుంటున్న అధ్వాన్నపు పరిస్థితుల్లో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. చేసిన పనికి వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి.
 
రుణమాఫీ విషయంలోనూ అసత్యాలు  
వ్యవసాయ రుణాల మాఫీ విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతోంది. 2014 మార్చి 13న నిర్వహించిన 184వ ఎస్‌ఎల్‌బీసీ (స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్ల కమిటీ) సమావేశం ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. కానీ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఇచ్చింది కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే. అయినా సరే చంద్రబాబు నిస్సిగ్గుగా తన 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే (2019 టీడీపీ మేనిఫెస్టోను చదువుతూ) ఎన్నికల హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేశాం. మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు చేశాం. చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేశాం.. అని రాశారు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. 

ఈ పథకం ఉన్నట్టా.. లేనట్టా? 
సున్నా వడ్డీ రుణాల విషయంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలను చంద్రబాబు ప్రభుత్వం మోసగించింది. 2016 నుంచి సున్నా వడ్డీ పథకం అమలు పూర్తిగా సున్నా. ఆగస్టు 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కోసం రూ.2,303 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆగస్టు 2016 నాటికి పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కోసం చెల్లించాల్సిన రూ.733 కోట్లు కూడా ఇవ్వలేదు. అంటే మొత్తంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం కోసం రూ.3,036 కోట్లు చెల్లించకుండా మోసం చేశారు. ఇలా రైతులు, అక్కచెల్లెమ్మలకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా ఎగ్గొట్టేస్తే ఆ పథకం ఉన్నట్టా.. లేనట్టా?  

అందుకే అక్కడ  కూర్చోబెట్టారు
వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదు. రైతులకు సున్నా వడ్డీ రుణాలు రూ.11,595 కోట్లతోపాటు పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు రూ.3,036 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టారు. కానీ ఇక్కడకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ అసత్యాలు చెబుతున్నారు. ప్రజలు దీన్ని గమనించారు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పుడు ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు కాస్త వచ్చే ఎన్నికలనాటికి 13కు తగ్గిపోతారు. లక్ష రూపాయలు ఇవ్వాల్సిన చోట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మేము అంటే 2 రూపాయలు ఇచ్చాం కాబట్టి రుణం తీరిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇన్ని అబద్ధాలు చెబుతూ నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే మీరు రాజీనామా చేసి పోవాలా? ఇక్కడే కూర్చోవాలా? ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. టీడీపీకి ఎక్కడా చిత్తశుద్ధి లేదు. రైతులు, మహిళలకు మేలు చేయాలన్న ఆరాటం లేదు. ఎంతసేపూ రాజకీయాలు ఎలా చేయాలి? దేన్ని వక్రీకరించాలి? ఎలా ట్విస్టు చేయాలి? అన్నదే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య సభ జరుగుతోందంటే బాధనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement