
టీడీపీ నేతల తీరును ఖండిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు
చిత్తూరు, చౌడేపల్లె : ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే తాముంటామని మండలంలోని దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లెకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డితోపాటు గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇటీవల బుటకపల్లె గ్రామస్తులు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దామోదరరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ నేతలు శ్రీనాథరెడ్డి మరికొందరితో కలిసి తమ గ్రామానికి వచ్చి, బలవంతంగా తలుపులు తెరిపించి, టీడీపీ కండువాలు కప్పారని మండిపడ్డారు.
ఆ ఫొటోలను అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తామెప్పుడూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే నడుస్తామని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా తమ నేత గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాసులరెడ్డి, చరణ్ కుమార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ప్రసాద్, రంజిత్, మునెప్ప, రామకృష్ణ, వెంకటస్వామి తదితరులున్నారు.