విలేకరులతో మాట్లాడుతున్న శిల్పా చక్రపాణిరెడ్డి
వెలుగోడు: సాగునీటి కోసం పోరాటం చేస్తానని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులన్నీ 90 శాతం పూర్తి చేశారన్నారు. గాలేరు నగరి, మల్యాల ఎత్తిపోతల పథకం, అలగనూరు రిజర్వాయర్, పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కుల సామర్థ్యం పెంచేందుకు వైఎస్‌ఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మిగిలిన పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి రైతును అని చెప్పుకుంటూ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 7 టీఎంసీల ఉంటే మార్చి ఆఖరి వరకు సాగునీరు ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేసినట్లే అన్నారు. ఒక ఎకరా కూడా రెండో పంట ఎండిపోకుండా వీబీఆర్ నుంచి మే చివరి వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పది వేల మంది రైతులతో పాదయాత్ర చేస్తానని హెచ్చరించారు. టీడీపీ నేతలు కాంట్రాక్టు పనులు చేసుకొని రైతుల కడుపు కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా కల్పించారు. తాను గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు వీబీఆర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్న సమయంలో కూడా వన్‌ఆర్, వన్ ఎల్ తూముల నుంచి రైతులకు నీరందించానని గుర్తు చేశారు.
సిద్ధాపురానికి తరలిరండి
సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద ఈ నెల ఆఖరున లేదంటే వచ్చే నెలలో నిర్వహించే వైఎస్‌ఆర్ జలహారతి కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి సిద్ధాపురం చెరువు వద్దకు ట్రాక్టర్ల మీద తరలిరావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అంబాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపంరెడ్డి, మండ్ల శంకర్‌రెడ్డి, పెద్ద స్వామన్న, వంగాల నాగేశ్వరరెడ్డి, నడిపి స్వామన్న, శ్రీనివాసులు, భూపాల్‌చౌదరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment