
సాక్షి, విజయవాడ : ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని, వెంటనే రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ విషయంపై హెల్త్ యూనివర్సిటీ వీసీకి మెమోరండం ఇచ్చామన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించి రీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు రీ కౌన్సెలింగ్ నిర్వహించలేదని, జీవో 550ను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందని మండిపడ్డారు. బీసీల హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని, రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు. హెల్త్ యూనివర్సిటీ అధికారులు వెంటనే రీ కౌన్సెలింగ్ చేయాలని, లేని పక్షంలో అన్ని మెడికల్ కాలేజీల వద్ద ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment