సాక్షి, విజయవాడ : టీడీపీ సర్కార్ రాష్ట్రానికి క్యాన్సర్ జబ్బులా పట్టుకుందని, ఆర్థికంగా అతలాకుతలం చేస్తోందని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక వనరుగా మార్చుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. స్వలాభం కోసం విభజన హామీలను తాకట్టు పెట్టారని, అప్పుల అప్పారావుగా మారి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ముంచేస్తున్నారని మండిపడ్డారు.
బాబు దోచుకున్న సొమ్మునే బాండ్ల రూపంలో ఇన్వెస్టర్ల పేరుతో కొంటున్నారని, సీఆర్డీఏ ఆర్థికంగా బలంగా ఉంటే ఎందుకు బాండ్లు ఇవ్వాల్సి వస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారం ఎవరు మోస్తారని నిలదీశారు. మంత్రుల ఛాంబర్లలోకి నీళ్లు ఎలా వచ్చాయని, మంత్రులే పైపులు కోశారా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడటంలో విఫలమైందన్నారు. అందుకే అందినకాడికి దోచుకుందాం అనే ఆలోచనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment