విధ్వంసానికి చంద్రబాబు కుట్ర | YSRCP Leaders Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

విధ్వంసానికి చంద్రబాబు కుట్ర

Published Thu, Jan 9 2020 5:13 AM | Last Updated on Thu, Jan 9 2020 5:13 AM

YSRCP Leaders Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి/గుడివాడ: బస్సు యాత్రల పేరుతో చంద్రబాబు ఉద్రిక్తతలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి లెజిస్లేటివ్‌ రాజధానిగా కొనసాగుతుందని చెబుతున్నా రాజధాని తరలిపోతోందంటూ టీడీపీ నేతలు 20 రోజులుగా హంగామా చేస్తున్నారన్నారు. రాజధాని తరలిస్తామని ప్రభుత్వం చెప్పకపోయినా.. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు ఎటువంటి అన్యాయం చేయదన్నారు.

రోజుకో డ్రామా: మంత్రి కన్నబాబు
విధ్వంసానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. జేఏసీ ముసుగులో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రోజుకో డ్రామాతో రక్తి కట్టిస్తున్నారన్నారు. బెంజ్‌ సర్కిల్‌లో నడిరోడ్డుపై బైఠాయించి కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. 

రెచ్చగొడుతున్నారు: మంత్రి వెలంపల్లి 
ఏడు నెలల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో మంచిపేరు రావడాన్ని తట్టుకోలేక చంద్రబాబు కుట్రలు, రౌడీయిజానికి పాల్పడుతున్నారని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. రాజధాని ముసుగులో రైతులు, మహిళలు, న్యాయవాదులను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పరపతిని కాపాడుకోవడానికి హింసను, విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.   

దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట 
మంత్రి కొడాలి నాని 
చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. బుధవారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంజ్‌ సర్కిల్‌లో బస్సుయాత్ర పేరుతో రాజకీయం చేయటం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు.

అలజడులు సృష్టిస్తున్న చంద్రబాబు
గుంటూరు రూరల్‌: ప్రతిపక్ష నేత చంద్రబాబు వర్గ విభేదాలు సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. ఆమె బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ర్యాలీకి అనుమతులు ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ర్యాలీ చేసి స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏదైనా అవసరమైతే శాంతియుతంగా చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  

సంఘ విద్రోహ శక్తిలా చంద్రబాబు 
ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజం  
పట్నంబజారు(గుంటూరు): రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తూ, సంఘ విద్రోహ శక్తిగా మారుతున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని తేల్చిచెప్పారు. అంబటి బుధవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ అశాంతిని సృష్టించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అనిల్‌కుమార్‌పై జరిగిన దాడే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. దాడి ఘటనలను చంద్రబాబు కనీసం ఖండించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చిచ్చుపెట్టి, లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో  అసలు ఏం కట్టారు, ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబు హడావుడి చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. నిజమైన రైతులకు అన్యాయం జరిగితే ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement