ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
సాక్షి, పశ్చిమగోదావరి: పవన్ కల్యాణ్ విశాఖ వేదికగా డ్రామాకు తెరలేపారని భీమవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ ఎప్పటికి చంద్రబాబుకి దత్తపుత్రుడేనన్నారు. ‘తాను ఏ పార్టీకి దత్తపుత్రుడిని కాదంటూ పవన్ ఈ ఏడాది బిగ్ జోక్ చెప్పారని’ ఎద్దేవా చేశారు. ‘2019 ఎన్నికల ప్రచారానికి పవన్‌కు రూ.35 కోట్లు అందాయి. నర్సాపురం పార్లమెంటులో తన సోదరుడు నాగబాబుని గెలిపించేందుకు ఆ డబ్బును పంచారు. చంద్రబాబు డబ్బు ఇస్తే, ఆ డబ్బును జనసేన పంచింద’ని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆరోపించారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ నుండి పవన్ ఎంత తీసుకున్నారో అందరికి తెలుసునన్నారు. జన సైనికులను పవన్ తీవ్రవాదులుగా మార్చి సమాజంపై వదిలేశారని.. అందుకే గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు.
పవన్ ఎప్పటికీ రియల్ హీరో కాలేరు..
పవన్ కల్యాణ్ రీల్ హీరో మాత్రమేనని.. రియల్ హీరో మాత్రం ఎప్పటికీ కాలేరని వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ అన్నారు. పాలకొల్లులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ రెండు కిలోమీటర్లు కారుపై ప్రయాణించి.. లాంగ్ మార్చ్‌ను రాంగ్ మార్చ్‌గా మార్చి కొత్త నిర్వచనాన్ని కొనుగొన్నారని’ ఎద్దేవా చేశారు. టీడీపీ అక్రమాలపై ఎప్పుడు ప్రశ్నించని పవన్‌కల్యాణ్.. రాంగ్‌మార్చ్ పెట్టి అజ్ఞానవాసిగా మిగిలిపోయారన్నారు. 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ పాలన చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment