
సాక్షి, పశ్చిమ గోదావరి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పవన్ తన సొంత లాభం కోసం అధికారంలో ఉన్న ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. చేగువేరా సిద్ధాంతాలు పాటిస్తున్నానని చెబుతున్న పవన్.. ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. పవన్ పెయిడ్ ఆర్టిస్టుగా రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. జనసేనతో పొత్తుపై బీజేపీ ఆలోచించాలని సూచించారు.
ప్రత్యేక హోదాపై బీజేపీని తీవ్రంగా విమర్శించిన పవన్‌తోనే.. ఆ పార్టీ పొత్తు పెట్టుకుందని గుర్తుచేశారు. అనాలోచిత నిర్ణయంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేస్తే పవన్‌ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో పాటు అసెంబ్లీని కూడా నిర్మించాలని కోరారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్.. గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
కాపులను నట్టేట ముంచిన వ్యక్తి పవన్.. : యడ్ల తాతాజీ
అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవని పవన్ కల్యాణ్ బీజేపీని ఏమి ఉద్ధరిస్తాడా అని పాలకొల్లు డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ ఎద్దేవా చేశారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. గన్నేరు చెట్టును ఎంత స్థాయిలోకి తీసుకెళ్లి ఉంచిన విషం చిమ్మే కాయలే కాస్తాయని.. జనసేన పార్టీ కూడా అంతేనని మండిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో మాదిరిగానే పవన్.. పార్టీలను మార్చడంలో కూడా పెద్ద వింతేమిలేదని విమర్శించారు. కాపులను నట్టేట ముంచిన పవన్.. తన స్వార్ధం కోసం బీజేపీతో కలుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాజధానిపై, పాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ విషయాలు కూడా తెలియని వ్యక్తి.. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం సిగ్గుచేటని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment