సాక్షి, కర్నూలు : తుంగభత్ర డ్యామ్(టీబీ డ్యామ్) నీటిలో కర్నూలు వాటను అనంతపురానికి తరలించరాదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, రైతువిభాగ రాష్ట్ర నాయకుడు భరత్ కుమార్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తుంగభత్ర డ్యామ్ నుంచి కేసీ కెనాల్ ద్వారా కర్నూలుకు 10 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో 38వేల ఎకరాల్లో రైతులు వరిపంటను సాగు చేశారన్నారు.
మిగిలిన 5.5టీఎంసీల వాటాను చంద్రబాబు అనంతపురానికి తరలించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇదే జరిగితే కర్నూలు రైతులు వేసిన పంటలు మధ్యలోనే ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా జిల్లా వాసులు టీడీపీకి ఓట్లు వేయలేదని చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీ కెనాల్‌కు రావాల్సిన వాటాను జిల్లాకు ఇచ్చి తీరాల్సిందేన్నారు. తుంగభద్ర డ్యామ్ నీటిని అనంతపురంకు తరలిస్తామన్న మంత్రి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవంబర్ 10 లోపు మంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే జిల్లాలోని ఆరు నియోజక వర్గాల రైతులతో చర్చించి, అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తునఆందోళన చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment