
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై వచ్చే వారం లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎంపీలు తెలిపారు. బుధవారం కూడా తీర్మానాన్ని చేపట్టకుండా సభ వాయిదా పడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సభ వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా దేశమంతా తెలియచేయటంలో వైఎస్సార్ సీపీ విజయం సాధించిందని మేకపాటి చెప్పారు. కావేరీ నదీ జలాలపై సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇవ్వనున్న నేపథ్యంలో తీర్పును అనుసరించి తమ నిరసన కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటామని ఏఐడీఎంకే ఎంపీలు చెప్పారన్నారు. వచ్చే వారంలో ఐదు రోజులు పాటు సభ జరిగే అవకాశం ఉండటంతో తప్పనిసరిగా అవిశ్వాసంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరప కుండా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తే రాజీనామాలు సమర్పించ డానికి లేఖలు కూడా సిద్ధం చేసుకుని బుధవారం సభకు వచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment