కడవకుదురు (చినగంజాం): అత్తింటి వేధింపులు భరించలేక గర్భిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కడవకుదురులో శనివారం జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కడవకుదురు నడిబొడ్డు పోతురాజు శిల వద్ద నివాసం ఉంటున్న బత్తిన సుబ్బారావు రెండో కోడలు మంజు వైప్లవి (23) ఇంట్లోని దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సుబ్బారావు కుమారుడు వెంకటేష్ బీహార్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఒంగోలు సత్యనారాయణపురానికి చెందిన పాపని సుబ్బారావు కుమార్తె పాపని మంజు వైప్లవితో 2016 మేలో వివాహమైంది. 2016కు పూర్వం వెంకటేష్ అన్న కృష్ణ ఒంగోలులోని పాపని సుబ్బారావు ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
తన అన్న వద్దకు తరుచూ వచ్చి వెళ్తున్న వెంకటేష్ అదే ఇంట్లో ఉంటున్న మంజును ప్రేమించాడు. పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు. ఆ సమయంలో వెంకటేష్ నాటకీయంగా రైలు పట్టాలపై రైలుకెదురు వెళ్తూ ఆమెను బెదిరించి తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆమెను తెచ్చుకుని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యను పుట్టింటికి వెళ్లనీయకుండా కడవకుదురులోనే ఉంచి భర్త విధులకు బీహార్ వెళ్లి అప్పుడప్పుడూ ఇంటికి వచ్చిపోతున్నాడు. మంజు తల్లిదండ్రులు బిడ్డపై మమకారంతో కడవకుదురు వచ్చి ఆమెను చూసుకొని వెళ్తుండే వారు.
ఈ నేపథ్యంలో అత్త రమాదేవి, భర్త వెంకటేష్‌లు పుట్టింటి నుంచి పాతిక సవర్ల బంగారం తేవడంతో పాటు ఇంటిని రాసివ్వమని వేధించడం ప్రారంభించారు. తీవ్ర మనస్తాపం చెంది తమ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారం క్రితం డ్యూటీ నుంచి సెలవుపై వచ్చిన భర్త ఇంటి వద్దే ఉంటున్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సురేష్ శనివారం రాత్రి పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త నుంచి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment