ఉత్తీర్ణతా శాతం తక్కువగా రావడంపై హెచ్‌ఎంల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గుంటూరు ఆర్‌జేడీ శ్రీనివాసరెడ్డి
ఒంగోలు: ఇటీవల నిర్వహించిన సమ్మేటివ్–1 పరీక్షల్లో పదో తరగతి ఫలితాలు అత్యంత దారుణంగా ఉన్న పలు పాఠశాలల హెడ్మాస్టర్ల పనితీరుపై పాఠశాల విద్యగుంటూరు ఆర్‌జేడీ కె.శ్రీనివాసరెడ్డి ఆగ్రహించారు. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హెచ్‌ఎంలు, ఎంఈవోలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడుసుమల్లి పాఠశాలలో 20 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుంటే 10 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం, అదే వైఆర్ పాఠశాలలో 43 మంది ఉంటే ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం దారుణంగా ఉందంటూ సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్ల పనితీరుపై మండిపడ్డారు. అత్యంత ప్రాధాన్యత గల మీటింగ్‌కు ముందస్తు అనుమతి తీసుకోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంజాయిషీ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ఉప విద్యాశాఖ అధికారులు కూడా తనిఖీలు సరిగా చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తక్షణమే సంబంధిత పాఠశాలలకు వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేనిపక్షంలో తాత్కాలికంగా అక్కడకు సిబ్బందిని పంపే అవకాశాన్ని కూడా పరిశీలించాలని డీఈవోను ఆదేశించారు. ప్రస్తుతం దారుణమైన ఫలితాలను చవిచూసిన పాఠశాలలు సమ్మేటివ్–2 అంటే ప్రీ పబ్లిక్ పరీక్షల నాటికి పూర్తిస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. 80 నుంచి 90 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో పదిమంది ఉపాధ్యాయులు ఉండి కూడా విద్యార్థులను తీర్చిదిద్దడంలో విఫలమవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుందన్నారు. రాబోయే రెండు నెలలు ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తప్పనిసరైతే తప్ప మెడికల్ లీవులు మంజూరు చేయరాదన్నారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా మంజూరు కోరితే వారిని మెడికల్ బోర్డుకు రిఫర్ చేయాలని డీఈఓకు స్పష్టం చేశారు.
అంతేగాకుండా పదో తరగతి పరీక్షల సమయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వ ఉపాధ్యాయులు సహకరిస్తున్నారంటూ తమకు అనేక ఫోన్లు వస్తున్నాయని, దీనిద్వారా ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి పరోక్షంగా ప్రభుత్వ ఉపాధ్యాయులే సహకారం అందిస్తున్నట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులలోను ప్రైవేటు పాఠశాలలకు సహకారమందిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ల నియామకం సమయంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించేవారినే నియమించాలని సూచించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలలో లెసన్ ప్లానింగ్ లేకపోవడం, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తమ పరిధిలో పాఠశాలలను విజిట్ చేయకపోవడం వంటివి సరికాదన్నారు. తల్లిదండ్రులు వలసవెళ్లే హాస్టళ్ల నిర్వహణలో ఏమాత్రం లోపం వ్యక్తమైనా అందుకు మండల విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
భయాందోళన చెందిన హెచ్‌ఎంలు, ఎంఈవోలు...
సమీక్షలో ఒకవైపు ఆర్‌జేడీ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సమావేశ మందిరంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా విద్యుత్ బోర్డు తగలబడింది. మెయిన్ ఆపివేసినా బోర్డు తగలబడిపోతూనే ఉండటంతో కొంతమంది ఆ సమీపంలో కూర్చుని ఉన్న హెచ్‌ఎంలు, ఎంఈఓలు భయాందోళనకు గురయ్యారు. అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే, ఒక హెచ్‌ఎం మాత్రం చాకచక్యంగా స్పందించి ప్లాస్టిక్ కుర్చీతో బోర్డు వద్ద మంటలు ఏర్పడిన ప్రదేశంలో పలుమార్లు తాకించడంతో మంటలు ఆరిపోయాయి. వెంటనే విద్యుత్‌శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించారు. సాయంత్రం నిర్వహించిన సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ హాజరై మార్కుల కోసం విద్యార్థులపై మానసిక ఒత్తిడి తేవద్దని సూచించారు. ప్రతి హెచ్‌ఎం ఒంగోలు బుల్‌లా వ్యవహరించి సరికొత్త ఆలోచనలతో పాఠశాలను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లాలని సూచించారు.
ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారి : డీఈఓ సుబ్బారావు
జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారన్నారు. సమ్మేటివ్–1, 2 పరీక్షలలో పదో తరగతిలో 91–100 శాతం మార్కులు సాధించినవారికి ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. వీరిని ప్రకాశం ఆణిముత్యాల పేరుతో పేర్కొన్నారు. 71–90 మధ్య ఉన్న ప్రకాశం వజ్రాలు, 35–70 మధ్య ఉన్నవారిని ప్రకాశం బంగారాలుగాను, 0–34 మధ్య ఉన్న విద్యార్థులను ప్రకాశం ఆశాజ్యోతులుగాను పేర్కొన్నామన్నారు. ఈ క్రమంలో ఆశాజ్యోతులు అందరినీ పాస్ అయ్యేలా తర్ఫీదునివ్వాలన్నారు. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 11,965 మంది బడిబయట పిల్లలు ఉన్నారని, వారందరినీ బడిలో చేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా 18 మండలాల్లో 2,347 మంది విద్యార్థులకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ సర్వశిక్షా అభియాన్‌కు సంబంధించిన అనేక కార్యక్రమాలపై సమీక్షించారు. రుద్రమదేవి సెల్ఫ్‌డిఫెన్స్ అకాడమీ వారు కరాటే పోటీలు నిర్వహించేందుకు వస్తారని, వారికి తప్పకుండా తరగతులు నిర్వహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment