మామా.. కోడలా.. ఎవరు పోటీచేస్తారు? తీగల తప్పుకుంటారా.. అనిత బరిలో దిగుతారా? మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. స్థానిక శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డికి దీటుగా ఆయన కోడలు అనితారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చీలిపోయిన పార్టీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది.
మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన తీగల కృష్ణారెడ్డి రాష్ట్రంలో మారిన సమీకరణల నేపథ్యంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఇప్పటికే పార్టీని వెన్నంటి నిలిచిన ముఖ్యనేతలకు ఈ పరిణామం మింగుడు పడలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన తమను కాదని తీగలకు ప్రాధాన్యం పెరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన కొత్త మనోహర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించిన కప్పాటి పాండురంగారెడ్డిలు తీగల చేరికను బాహాటంగానే వ్యతిరేకించారు.
ఈ మేరకు వైరివర్గాలుగా మారిన సీనియర్లను సమన్వయపరిచేందుకు అధిష్టానం కప్పాటిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవితో సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. గ్రూపులకు ఫుల్‌స్టాప్ పడిందని హైకమాండ్ భావిస్తున్నాక్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికివారుగానే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో తీగల అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోతే తమకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇద్దరిలోనూ ఉంది.
ఇదిలావుండగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సొంత కోడలు నుంచే తీవ్ర పోటీ ఎదురవుతున్నట్లు అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. మామ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతానని ఆమె స్పష్టం చేస్తుండడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడం గులాబీ శ్రేణులను అయోమయంలో పడేస్తోంది. వయోభారం దృష్ట్యా మామకు టికెట్ నిరాకరిస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలనే అంశాన్ని ఆమె అంతర్గతంగా తెరమీదకు తెస్తున్నారు. తమ కుటుంబానికి గాకుండా మరొకరు టికెట్ ఎగురేసుకుపోకుండా ఈ ఎత్తుగడ వేసినట్లు రాజకీయవర్గాల విశ్లేషిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనే మనసులోని మాటను మామతో అనితారెడ్డి ఇప్పటికే వెల్లడించారని, ఆయన మాత్రం కోడలు సూచనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీచేస్తానని తెగేసి చెప్పినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
సబితను ఢీకొనే శక్తి తనకు ఉందని భావన
మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సారి మహేశ్వరం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో బరిలో దిగడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఈ పరిణామాన్ని కూడా అనితారెడ్డి ఉపయోగించుకుంట్నుట్లు కనబడుతోంది. సబితను ఢీకొనడం మహిళగా తనకు కలిసివస్తుందనే అంచనా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళగా ప్రజల్లోకి వెళితే సానుకూల స్పందన లభిస్తుందని, ఇది విజయతీరాలవైపు తీసుకెళుతుందని ఆమె సన్నిహితుల వద్ద అంటున్నారు.
ఆర్ట్ ఫౌండేషన్‌తో ముందుకు..
టికెట్టు విషయం పక్కనపెడితే అనితారెడ్డి తీగల(ఆర్ట్) ఫౌండేషన్ పేరిట అనితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధి పెంపొందించేందుకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మామ కృష్ణారెడ్డితోపాటు పాల్గొంటూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మామ, కోడలు మధ్య టికెట్ విషయంతో అంతర్గతంగా పోరు నడుస్తున్న తరుణంలో ఎవరికి టికెట్ వస్తుందోననే పార్టీ శ్రేణులు చర్చింకుంటున్నాయి. ఈ ఇరువురు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని టీఆర్‌ఎస్ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.
ఆర్ట్ ఫౌండేషన్‌తో ముందుకు..
టికెట్టు విషయం పక్కనపెడితే అనితారెడ్డి తీగల(ఆర్ట్) ఫౌండేషన్ పేరిట అనితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధి పెంపొందించేందుకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మామ కృష్ణారెడ్డితోపాటు పాల్గొంటూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మామ, కోడలు మధ్య టికెట్ విషయంతో అంతర్గతంగా పోరు నడుస్తున్న తరుణంలో ఎవరికి టికెట్ వస్తుందోనని పార్టీ శ్రేణులు చర్చింకుంటున్నాయి. ఈ ఇరువురు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని టీఆర్‌ఎస్ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment