పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వృద్దులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏ ఆధారమూ లేనివారికి సకాలంలో దక్కాల్సిన ‘ఆసరా’ ఆలస్యమవుతోంది. ఒకటికాదు.. రెండుకాదు, ప్రతినెలా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పింఛన్‌దారులు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ వరుసగా మూడు నాలుగు నెలలపాటు లబ్ధిదారులు పింఛన్ సొమ్ముకు నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. ఒక నిర్ధిష్ట సమయమంటూ లేకపోవడంతో పింఛర్‌దారులు అయోమయంలో పడ్డారు. ఎప్పుడు ఇస్తారో తెలియని సంకట స్థితిలో చిక్కుకున్నారు.
జనవరి నెలకు సంబంధించిన పింఛన్ సొమ్ము ఇంకా అందలేదు. నిధులు విడుదల కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు కేవలం పింఛన్‌సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతటి కీలకమైన పింఛన్ సొమ్ము సకాలంలో అందితేనే వారు తమ అవసరాలు తీర్చుకుంటారు. ఇది జరగపోవడంతే అప్పు తెచ్చుకుని పూట గడిపే దుస్థితి నెలకొంది.
అవసరానికి అందవు..
జిల్లాలో 1.24 లక్షల మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య, వికలాంగ, వితంతువులు, గీత, చేనేత కార్మికులు ఉన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి 4,038 మంది ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పంపిణీ చేస్తున్నారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలో బ్యాంకు ద్వారా నేరుగా పింఛన్‌దారుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా బయోమెట్రిక్ విధానంలో పంపిణీ చేస్తున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు లబ్ధిదారులకు పించన్‌సొమ్ము అందేది. ఆయన మరణానంతరం నిధుల విడుదలతో జాప్యం జరుగుతోంది. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సకాలంలో పింఛన్లు అందిన దాఖలాలు లేవు. తొలుత ప్రతినెలా 11 నుంచి 14వ తేదీలోగా పింఛన్ ఇచ్చేవారు. ఇది క్రమంగా 14 నుంచి 20 తేదీకి మారింది. కొంతకాలం నుంచి ఈ తేదీలకు కూడా చరమగీతం పాడారు. ప్రస్తుతం ఫిబ్రవరిలోకి అడుగు పెట్టినా జనవరి నెల పింఛను ఇంతవరకు అందలేదు. సకాలంలో పింఛన్లు అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
నిర్లక్ష్యం తగదు
ఆసరా పింఛన్లు అందజేయడంలో నిర్లక్ష్యం తగదు. ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడిగితే పట్టించుకునే వారు లేరు. సకాలంలో ఇస్తే మా అవసరాలు తీర్చుకుంటాం. లేకుంటే అప్పు చేయక తప్పడం లేదు. టైం ప్రకారం పింఛను అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– కట్టెల కిష్టయ్య, వికలాంగుడు
ఎప్పుడూ ఆలస్యమే
సర్కారు పెన్షన్ల సొమ్ము పెంచింది కానీ.. మాకు ఆ తృప్తి లేకుండా చేస్తోంది. గతంలో పింఛన్ సొమ్ముకు ఎన్నడూ లేటు కాలేదు. ఇప్పుడు సొమ్మును పెంచినా అవసరానికి మాత్రం ఇవ్వడం లేదు. వయసు పైబడ్డాక పిల్లలను అడగాలంటే ఇబ్బంది పడుతున్నాం. పింఛనైనా వస్తుందని అనుకుంటే.. అదీ లేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలవదు.
– అంజమ్మ, వితంతు పెన్షన్‌దారు అప్పు జేయాల్సి వచ్చింది
ప్రతినెలా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల అవసరాల నిమిత్తం అప్పు చేస్తున్నాం. రూ.వెయ్యి కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాం. దవాఖానకు పోదామంటే నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఎవరినైనా అడుగుదామంటే.. ఎవరిస్తరు బిడ్డా. ప్రభుత్వం లేటు చేయకుండా పింఛన్లు ఇస్తే మాలాంటి ముసలోల్లకు ఇబ్బంది ఉండదు.
– చెర్కూరి లక్ష్మయ్య, వృద్ధుడు
Comments
Please login to add a commentAdd a comment