
ముంబై: ఇంటర్నెట్, సోషల్ మీడియా పుణ్యాన ఇన్నాళ్లు వెలుగులోకి రాని ప్రతిభావంతుల గురించి ప్రపంచానికి తెలియడం.. వారు రాత్రికి రాత్రే సూపర్ స్టార్‌లుగా మారుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చూశాం. తాజాగా ఈ లిస్ట్‌లోకి ‘ఎమిలీ’ కూడా వచ్చి చేరింది. తన గానంతో నెటిజన్ల మనసు దోచుకుంటుంది ఎమిలీ. ఇంతకు ఎమిలీ ఎవరనేగా మీ అనుమానం.. గాడిద. అవును మీరు చదివింది కరెక్టే ఎమిలీ ఓ గాడిద. సాధరణంగా గొంతు బాగాలేకపోయినా పాటలు పాడుతూ.. ఇబ్బంది పెట్టే వారిని గార్దభ స్వరం(గాడిద గొంతు) అంటూ వెక్కిరిస్తాం. కానీ ఇక్కడ గాడిద గానమే వైరల్ కావడం విశేషం.
ఆ వివరాలు.. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యం పాలైన ‘ఎమిలీ’ అనే ఆడ గాడిదను దాని యజమాని రోడ్డు మీద వదిలేసి వెళ్లాడు. దాంతో పుణెకు చెందిన ఓ జంతు సంరక్షణశాల యాజమాన్యం ఎమిలీని తీసుకెళ్లి.. చికిత్స చేసి కోలుకునేలా చేశారు. ఈ సంరక్షణశాలలో ఎమిలీతో పాటు పిల్లులు, కుక్కలు, దున్నపోతులు వంటి ఇతర జంతువులు కూడా చాలానే ఉన్నాయి. ఎమిలీకి సంతోషం కలిగినప్పుడు కూనిరాగాలు తీస్తుందట. ఇది విని మిగతా జంతువులు దాని చుట్టూ చేరి సంతోషంగా ఆడటం గమనించారు సిబ్బంది. దాంతో వారికి ఓ వినూత్న ఆలోచన వచ్చింది.
ఎప్పుడూ గాయపడిన జంతువుల గురించే వీడియోలు తీసి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాం. ఈ సారి వెరైటీగా ఎమిలీ కూనిరాగాలను వీడియో తీద్దామనుకున్నారు. అలానే చేసి ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ వీడియో వైరల్ అయ్యిందంటున్నారు సదరు ఎన్జీవో ప్రతినిధులు. ఐర్లాండ్‌కు చెందిన హ్యారియేట్ అనే గాడిద కూడా ఇలానే ప్రచారం పొందిందని.. దాన్ని చూసే తాము ఇలా ప్రయత్నించామంటున్నారు ఎన్జీవో ప్రతినిధులు.