నాటింగ్‌హామ్: ఈ టెస్టు సిరీస్‌లో మొదటిసారి భారత్ బ్యాటింగ్‌లో సత్తాచాటింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (152 బంతుల్లో 97; 11 ఫోర్లు), వైస్ కెప్టెన్ అజింక్య రహానే ( 131 బంతుల్లో 81; 12 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో తొలిరోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3 వికెట్లు తీశాడు. మూడో టెస్టులో భారత్ తమ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. దినేశ్ కార్తీక్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు తొలిసారి అవకాశమివ్వగా, కుల్దీప్ స్థానంలో ఫిట్‌నెస్ సంతరించుకున్న బుమ్రా, మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్ బరిలోకి దిగారు. భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ మృతికి సంతాప సూచకంగా భారత ఆటగాళ్లంతా తొలిరోజు ఆటలో నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. 77 ఏళ్ల వాడేకర్ అనారోగ్య కారణాలతో ఈ నెల 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఓపెనింగ్ మెరుగైంది కానీ...
ఈ మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ కోహ్లి టాస్ ఓడాడు. అయితే ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్ (65 బంతుల్లో 35; 7 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (53 బంతుల్లో 23; 4 ఫోర్లు) ఈ టెస్టు సిరీస్‌లోనే మెరుగైన ఆరంభాన్నిచ్చారు. సాధికారికంగా ఆడుతూ ఇంగ్లండ్ పేసర్లు అండర్సన్, క్రిస్ బ్రాడ్, స్టోక్స్‌లపై పైచేయి కనబరిచారు. ఈ ముగ్గురి బౌలింగ్‌ను ఎలాంటి తడబాటు లేకుండా ఎదుర్కొన్నారు. వోక్స్‌పై కూడా పట్టు సాధించే ప్రయత్నం చేశారు. అతను వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రాహుల్ 2 బౌం డరీలు బాదాడు. జట్టు స్కోరు 50 దాటింది. ఎట్టకేలకు వోక్స్ తన మూడో ఓవర్లో (ఇన్నింగ్స్ 19) సఫలమయ్యాడు. ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న ధావన్‌ను ఔట్ చేశాడు. దీంతో తొలివికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కాసేపటికే వోక్స్ మరో ఓపెనర్ రాహుల్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. భారత ఓపెనర్ రివ్యూకు వెళ్లినా లాభం లేకపోయింది. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (14) కూడా వోక్స్ బౌలింగ్‌లోనే నిష్క్రమించాడు. దీంతో 22 పరుగుల వ్యవధిలో భారత్ మూడు కీలక వికెట్లను కోల్పోయింది. కోహ్లి, రహానే క్రీజులోకి రాగా... భారత్ 82/3 స్కోరు వద్ద లంచ్ విరామానికెళ్లింది.
రాణించిన రహానే, కోహ్లి
స్వల్ప వ్యవధిలో మూడు టాపార్డర్ వికెట్లను దక్కించుకున్న వోక్స్ ఇక భారత్ కథ ముగించొచ్చని భావించాడు. కానీ రహానే, కోహ్లి ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో ఇంగ్లండ్ శిబిరం కుదేలైంది. రెండో సెషన్‌లో ఈ జోడి ప్రత్యర్థి బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కొంది. దీంతో మరో వికెట్ చేజారకుండా భారత్ 100, 150 పరుగుల్ని అధిగమించింది. ఈ క్రమంలో మొదట విరాట్ కోహ్లి 74 బంతుల్లో 6 బౌండరీల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆ వెంటనే రహానే కూడా 76 బంతుల్లో 7 ఫోర్లతో ఫిఫ్టీ పూర్తి చేశాడు. మరోవైపు వికెట్ కోసం ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించిన ఈ జోడీని విడగొట్టలేకపోయాడు. రెండో సెషన్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోని భారత్ 107 పరుగులు చేసింది. 189/3 స్కోరు వద్ద ఈ సెషన్ ముగిసింది.
నెర్వస్ నైంటీస్‌లో కోహ్లి...
రెండో సెషన్‌లో శక్తికిమించి శ్రమించినా వికెట్ పడగొట్టలేకపోయిన ఇంగ్లండ్ బౌలర్లను మూడో సెషన్ మురిపించింది. క్రీజులో నిలదొక్కుకొని సెంచరీ దిశగా పయనిస్తున్న రహానే, కోహ్లి వికెట్లను చేజిక్కించుకుంది. ఆట మొదలైన కాసేపటికే జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. రహానే కాస్త వేగం పెంచగా, కోహ్లి బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో పరుగుల రాక సులభమైంది. అయితే ఇన్నింగ్స్ 67వ ఓవర్ వేసిన బ్రాడ్... రహానే ఆట ముగించాడు. ఆఫ్ స్టంప్ ఆవల వెళుతున్న బంతిని రహానే కట్ చేయాలని భావించాడు. కానీ అతని బ్యాట్ అంచును తాకుతూ వెళ్లిన బంతి ఫస్ట్ స్లిప్‌లో వేగంగా దూసుకొచ్చింది. కుక్ రెప్పపాటు వ్యవధిలోనే స్పందించి ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 159 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్‌కు జతయ్యాడు. ఇద్దరు నింపాదిగా ఆడుతున్న దశలో సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో కోహ్లి... స్పిన్నర్ రషీద్ చేతికి చిక్కాడు. దీంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు.
తొలి టెస్టు ఆడుతున్న రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చి రాగానే భారీ సిక్సర్‌తో అలరించాడు. భారత సుదీర్ఘ టెస్టు చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు సిక్సర్‌తో ఖాతా తెరవలేదు. ఇప్పుడీ ఘనత రిషభ్ సొంతమైంది. పంత్ (32 బంతుల్లో 22 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), పాండ్యాలిద్దరు నింపాదిగా ఆడారు. జట్టు స్కోరు 300 పరుగులు దాటాక పాండ్యా (18)ను అండర్సన్ ఔట్‌చేయడంతో తొలి రోజు ఆటకు తెరపడింది.
నిలబడి... తడబడి..!
Published Sun, Aug 19 2018 1:40 AM | Last Updated on Sun, Aug 19 2018 9:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment