
ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత
పుణె: ఆస్ట్రేలియాతో ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభమైన తొలి టెస్టులో భారత్ పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(38)ను అవుట్ చేయడం ద్వారా టెస్టుల్లో ఒక ఆటగాడ్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనతను సాధించాడు. టెస్టు మ్యాచ్ ల్లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో వార్నర్ అవుట్ కావడం ఇది ఐదోసారి. ఈరోజు ఇన్నింగ్స్ తో కలుపుకుని వార్నర్ ఐదోసారి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. తద్వారా ఆసీస్ బౌలర్ షాన్ మార్ష్ తో కలిసి ఉమేశ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు షాన్ మార్ష్ ఐదుసార్లు అత్యధికంగా ఒక ఆటగాడ్ని అవుట్ చేసిన ఘనతను సాధించాడు.
భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ ఆరంభంలోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 15 ఓవర్ చివరి బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు. జయంత్ యాదవ్ వేసిన ఆ ఓవర్ ఆఖరి బంతికి వార్నర్ బౌల్డ్ అయినప్పటికీ, అది నో బాల్ అయ్యింది. దాంతో వార్నర్ బ్రతికిపోయాడు. కాగా, ఉమేశ్ యాదవ్ వేసిన 28 ఓవర్ రెండో బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు. ఉమేశ్ యాదవ్ సంధించిన ఆ ఇన్ స్వింగర్కు వార్నర్ వికెట్లను కాపాడుకోలేక పోయాడు. దాంతో 82 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ ను కోల్పోయింది. మరొక ఓపెనర్ రెన్ షా(36) రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు వెళ్లాడు.