
బెంగళూరు: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. తొలి వికెట్ కు 200 కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారీ స్కోరు దిశగా పయనిస్తున్న ఆసీస్ కు షాకిచ్చారు. టీమిండియా బౌలర్లు స్వల్ప వ్యవధిలో మూడు ఆసీస్ వికెట్లను తీసి పైచేయి సాధించారు. తొలుత శతకం సాధించిన డేవిడ్ వార్నర్(124;119 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ను కేదర్ జాదవ్ పెవిలియన్ కు పంపి మంచి బ్రేక్ ఇచ్చాడు. జాదవ్ బౌలింగ్ లో షాట్ కు యత్నించిన వార్నర్ .. అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో 231 పరుగుల వద్ద ఆసీస్ మొదటి వికెట్ ను నష్టపోయింది.
అనంతరం అదే స్కోరు వద్ద అరోన్ ఫించ్ ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. ఉమేశ్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చిన ఫించ్ (94; 96 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రెండో వికెట్ అవుటయ్యాడు. ఆపై కాసేపటికి కెప్టెన్ స్టీవ్ స్మిత్(3) మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 38 ఓవర్ తొలి బంతిని మిడ్ వికెట్ గా మీదుగా ఆడిన స్మిత్.. విరాట్ కోహ్లికి దొరికిపోయాడు. మెరుపు వేగంతో కదిలిని విరాట్ కోహ్లి అద్భుతంగా క్యాచ్ అందుకుని స్మిత్ ను పెవిలియన్ బాట పట్టించాడు. కాగా, ఇది ఉమేశ్ యాదవ్ కు వన్డేల్లో 100 వ వికెట్. దాంతో వన్డేల్లో ఉమేశ్ 'సెంచరీ' వికెట్ల మార్కును చేరి అరుదైన క్లబ్ లో చేరిపోయాడు.
ఆసీస్ వరుసగా మూడు వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టు స్కోరులో వేగం తగ్గింది. 32 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 203 పరుగులు ఆసీస్.. 40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.