అక్షర్ పటేల్ మాయాజాలం
♦ దక్షిణాఫ్రికా ‘ఎ’ 260 ఆలౌట్
♦ భారత్ ‘ఎ’తో రెండో అనధికార టెస్టు
వాయ్‌నాడ్ (కేరళ) : స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/92) స్పిన్ మాయాజాలానికి మంగళవారం ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు తడబడింది. ఓపెనర్ వాన్‌జెల్ (193 బంతుల్లో 96; 13 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిపోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో భారత బౌలర్ల క్రమశిక్షణ ముందు సఫారీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా తొలి రోజు దక్షిణాఫ్రికా 89.5 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ ఓపెనర్లలో హెండ్రిక్స్ (22) విఫలమైనా.. వాన్‌జెల్ నిలకడగా ఆడాడు. తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించిన వాన్‌జెల్... క్లొయెటీ (26)తో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు సమకూర్చాడు.
తర్వాత రమేలా (30) మెరుగ్గా ఆడటంతో సఫారీ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. వాన్‌జెల్‌తో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించి రమేలా వెనుదిరిగాడు. దీంతో ఓ దశలో దక్షిణాఫ్రికా జట్టు 59 ఓవర్లలో 2 వికెట్లకు 185 పరుగుల పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 72వ ఓవర్‌లో వాన్‌జెల్‌ను... జయంత్ అవుట్ చేయడంతో పర్యాటక జట్టు ఇన్నింగ్స్ తడబడింది. దక్షిణాఫ్రికా 75 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లలో జయంత్ 3, కర్ణ్ 2 వికెట్లు తీశారు.